Tuesday, April 30, 2019

wild elephant walks along guwahati city stalls traffic


గువాహటిలో చొరబడిన అడవి ఏనుగు స్తంభించిన ట్రాఫిక్

గువాహటి నగరంలోకి మంగళవారం (ఏప్రిల్ 30) అడవి ఏనుగు చొచ్చుకువచ్చి అలజడి సృష్టించింది. ఇక్కడకు కేవలం 9 కిలోమీటర్ల సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. అందులో నుంచి స్థానిక జి.ఎస్.రోడ్డులోకి ఏనుగు ప్రవేశించింది. సమీపంలోనే రాష్ట్ర సచివాలయం, ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. దాంతో మంగళవారం సాయంత్రం ఏనుగు నగరంలోకి చొరబడే సమయానికి పెద్ద సంఖ్యలో జనం రోడ్లపై ఉండడంతో కలకలం రేగింది. గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కల్గింది. రోడ్డుపై ఏనుగు తిరుగుతుంటే పలువురు సెల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఏనుగు అమ్చాంగ్ ప్రాంతం నుంచి సుమారు 25 కిలోమీటర్లు నడచుకుంటూ గువాహటి లోకి వచ్చినట్లు భావిస్తున్నారు.  ఆహారం లేదా నీటి కోసమే ఏనుగు ఇలా నగరంలోకి వచ్చి ఉంటుందని తెలుస్తోంది. వెంటనే జూ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగును మళ్లీ అడవిలోకి పంపడానికి చేసిన ప్రయత్నాలు రాత్రి వరకు ఫలించలేదు. ఏనుగు సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో తిష్ఠ వేసింది. అటవీశాఖ మంత్రి పరిమల్ సుక్లాబైధ్య మాట్లాడుతూ ఏనుగును అడవిలోకి తిరిగి పంపడానికి ఈ రాత్రి చర్యలు చేపడతామని చెప్పారు. ఏనుగు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చనే ట్రాంక్విలైజర్ ద్వారా మత్తు ఇచ్చే ఆలోచనను విరమించుకున్నామన్నారు.

rahul gandhi expresses regret again in sc over remarks on rafale verdict



‘చౌకీదార్ చోర్ హై’ అంశంపై మరోసారి విచారం వ్యక్తం చేసిన రాహుల్
చౌకీదార్ చోర్ హై అంశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వీడ్డం లేదు. సుప్రీంకోర్టులో ఆయన తాజా అఫిడవిట్ దాఖలు చేస్తూ ఎన్నికల ప్రచార వేడిలో రాఫెల్ ఒప్పందంపై స్పందిస్తూ కావలి వాడే దొంగ(చౌకీదార్ చోర్ హై) అని చేసిన వ్యాఖ్యలపై మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గతంలో రాహుల్ సుప్రీంకు ఈ విషయమై సమాధానమిస్తూ ప్రచార పర్వంలో యథాలాపంగా చౌకీదార్ చోర్ హై అనే మాటలు వాడినట్లు తెలిపారు. ఆ మాటలు తప్పుడు అన్వయానికి దారితీయడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు అఫిడవిట్ లో స్పష్టం చేశారు. అయితే రాహుల్ ‘విచారం’ వ్యక్తం చేస్తున్నట్లు చాలా సింపుల్ గా తప్పించుకోజూడ్డం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని మీనాక్షి మరోసారి సుప్రీం దృష్టికి తెచ్చారు. దాంతో రాహుల్ తాజా అఫిడవిట్ ఇస్తూ ‘విచారం వ్యక్తం చేస్తున్నా’ అనే మాటల్నే పునరుద్ఘాటించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో దేశ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ తప్పుబడుతూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చౌకీదార్ గా తనను తాను చెప్పుకునే మోదీని ఉద్దేశిస్తూ అనేక వేదికలపై నుంచి చౌకీదార్ చోర్ హై అని రాహుల్ ఎదురుదాడి ప్రారంభించారు. రాఫెల్ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది రాహుల్ ఆరోపణల సారాంశం. అయితే ఈ అంశం సుప్రీం కోర్టు చెంతకు చేరడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. రాహుల్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో తమ రాజకీయ ప్రత్యర్థులే చౌకీదార్ చోర్ హై మాటలకు తప్పుడు అన్వయాన్నిచ్చి తనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో తను కోర్టు ధిక్కరణకు పాల్పడిందే లేదని రాహుల్ స్పష్టం చేశారు.

Monday, April 29, 2019

sun rises.. play off hopes alive

సన్ రైజెస్..కింగ్స్ పై పైచెయ్యి
·        వార్నర్ యథావిధిగా హాఫ్ సెంచరీ
·        45 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి
ఉప్పల్ వేదికగా ఐపీఎల్ సీజన్ 12 సోమవారం నాటి మ్యాచ్లో కింగ్స్ లెవన్ పంజాబ్ పై సన్ రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్  ముందు వరకు  హైదరాబాద్, పంజాబ్ జట్లు 5,6 స్థానాల్లో నిలిచాయి. రెండు టీంలు చెరి అయిదు మ్యాచ్ ల్లో గెలిచినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో పంజాబ్ కన్నా హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ముందుంది. రెండు జట్లకు సోమవారం 12వ మ్యాచ్ కాగా పంజాబ్ పై  హైదరాబాద్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సమష్టిగా రాణించి విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్  ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వార్నర్ శరవేగంగా మళ్లీ అర్ధ సెంచరీ 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. క్రితం మ్యాచ్ లో ఒక్క బౌండరీ కూడా కొట్టని వార్నర్ ఈ మ్యాచ్ లో రెండు సిక్సర్లు సహా ఏడు బౌండరీలు బాదాడు. వృద్దీ మాన్ సాహా (28), మనీశ్ పాండే (36)లు మెరవడంతో ఆరు వికెట్ల నష్టానికి 212 భారీ పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ, అశ్విన్ చెరి రెండు వికెట్లు, మురగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 213 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ డెత్ ఓవర్ల వరకు ఆడి 79 పరుగులతో ఒంటరి పోరాటం చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ 27 పరుగులు, నికోలస్ పూరన్ చేసిన 21 పరుగులు జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాయి. ఏడు వికెట్లను కోల్పోయి నిర్దేశిత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 167 పరుగులు మాత్రమే చేయగల్గింది. హైదరాబాద్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరి మూడు వికెట్లు తీయగా సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లోనూ భువనేశ్వర్ కుమార్ కు వికెట్ దక్కలేదు. సన్ రైజర్స్ కలిసికట్టుగా ఆడి 45 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వార్నర్ నిలిచాడు.

sri lanka's face veil ban comes into effect today onwards


శ్రీలంకలో అమల్లోకి వచ్చిన బురఖాల నిషేధం
దేశంలో ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు సహకరించిన వారిలో బురఖాలు ధరించిన మహిళలున్నట్లు తేలడంతో శ్రీలంక వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం సోమవారం(ఏప్రిల్ 29) నుంచి అమల్లోకి వచ్చింది. శ్రీలంకలో చర్చిలు, అయిదు నక్షత్రాల హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడగా 300 మందికిపైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కళ్లు మినహా మొహాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖాలు ధరించడం వల్ల వ్యక్తుల్ని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అధ్యక్షుడు సిరిసేన కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. యూరప్ లో ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియాల్లో ఆత్మాహుతి బాంబు దాడుల నేపథ్యంలో ఆ దేశాల్లో పూర్తి మొహాన్ని కప్పి ఉంచే బురఖాలపై నిషేధం అమలులో ఉంది.  కెనడా కూడా ఇదే రీతిగా బురఖాలపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించింది. అధ్యక్షుడు సిరిసేన ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ బురఖాల్ని నేరుగా ప్రస్తావించకుండా పూర్తి మొహాల్ని కప్పి ఉంచే బురఖాలపై నిషేధాన్ని పార్లమెంట్ ద్వారా అత్యవసర చట్టంగా అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. పలువురు బురఖాలు ధరించిన తిరుగుతుండడం వల్ల  నిందితుల్ని పట్టుకోవడంలో నిఘా వర్గాలు, పోలీసులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అనుమానిత ముస్లిం సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ తో పాటు దాని అనుబంధ సంస్థని శ్రీలంక ఇప్పటికే నిషేధించింది. మరో వైపు దేశంలోని సెయిలాన్ జమాయితుల్ ఉలుమాకు చెందిన మత ప్రవక్తలు పూర్తి మొహాల్ని కప్పి ఉంచే బురఖాలు ధరించకుండా ముస్లిం మహిళలు భద్రతా బలగాలకు సహకరించాలని విన్నవించారు. శ్రీలంకలో అల్పసంఖ్యాక వర్గాల్లో హిందువుల తర్వాత 9శాతం జనాభాతో ముస్లింలు రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో ఏడు శాతం క్రిస్టియన్లు ఉన్నారు.

spice jet plane overshoots runway at shirdi airport operations hit


రన్ వే పై జారిన స్పైస్ జెట్.. ప్రయాణికులు సురక్షితం
షిర్డి విమానాశ్రయంలో సోమవారం (ఏప్రిల్ 29) స్పైస్ జెట్ విమానం రన్ వే నుంచి పక్కకు జారింది. లాండింగ్ ప్రాంతం నుంచి 30-40 మీటర్లు ముందుకు దూసుకువెళ్లి ఆగింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు, ఎవరికీ ఏ హాని జరగలేదు. దాంతో ఇతర విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన షిర్డీకి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఘటన అనంతరం స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రయాణికులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూశామని చెప్పారు. ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులున్నది, ఘటనకు గల కారణంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

 


Sunday, April 28, 2019

10 dead 25 injured in Himachal bus accident


హిమాచల్ బస్ ప్రమాదంలో 10 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో శనివారం(ఏప్రిల్27) రాత్రి జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10 దుర్మరణం చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో ప్రయివేటు బస్ దల్హౌసి- పటాన్ కోట్ రోడ్డులో ప్రయాణిస్తూ అదుపుతప్పి 200 అడుగుల లోయలోకి జారిపోయింది. మృతుల్లో ముగ్గురు మహిళలున్నట్లు ఎస్.పి. మోనికా భూటాన్గురు తెలిపారు. దల్హౌసి కంటోన్మెంట్ కు చెందిన ఆర్మీ సహాయక బృందాలు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారందర్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఆర్మీ వెంటనే రంగంలోకి దిగడంతో మృతుల సంఖ్య మరింత పెరగకుండా నివారించగల్గినట్లు కల్నల్ ఆనంద్ చెప్పారు. ఘటనపై రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Saturday, April 27, 2019

returning officer asks police to register fir against gambir for holding rally without permission


గౌతం గంభీర్ పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం
తాజాగా రాజకీయ నాయకుడి అవతారంలోకి మారిన క్రికెటర్ గౌతం గంభీర్ అప్పుడే కేసుల్లో చిక్కుకుంటున్నాడు. ఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంభీర్ అనుమతి లేకుండా జంగ్పూర్ లో గురువారం (ఏప్రిల్ 25) ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొన్నాడు. పెద్ద ఎత్తున రోడ్ షో కూడా నిర్వహించాడు. దాంతో రిటర్నింగ్ ఆఫీసర్ కె.మహేశ్ బీజేపీ అభ్యర్థి గంభీర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి అతిశ్ లతో గంభీర్ పోటీపడుతున్నాడు. గంభీర్ కు ఓటర్ల జాబితాలో రెండు చోట్ల ఓట్లున్నట్లు కూడా ఆప్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు.

a show of brother sister love and exchange of banter as rahul priyanka cross paths at kanpur airport


రాహుల్ ప్రియాంకల ఆనందహేల
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బిజిబిజీగా తిరుగుతున్నారు. అనుకోకుండా శనివారం (ఏప్రిల్27) అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కాన్పూర్ విమానాశ్రయంలో కలిశారు. ఎవరి ప్రచార సభలకు వారు వెళ్తున్న సమయంలో వీరిద్దరూ ఎదురుపడ్డంతో ఇలా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రియాంక కాన్పూర్ విమానాశ్రయానికి వస్తున్నారని తెలిసి అప్పటికే అక్కడ ఉన్న రాహుల్ సోదరిని పలకరించడానికి ఎదురెళ్లారు. అన్నను చూడగానే ఉబ్బితబ్బిబైన ప్రియాంక ఒక్క ఉదుటన రాహుల్ చెంతకు చేరి ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ‘ఎన్నిక ల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నాను నీ మంచి సోదరుడికి ఇచ్చే విమానం ఇదేనా’ అని సరదాగా ప్రియాంకతో జోక్ చేశారు. అందుకు స్పందించిన ప్రియాంక అన్న భుజాలపై చేతుల వేసి నవ్వులు చిందించారు. ప్రియాంక ప్రయాణిస్తున్న విమానాలతో పోలిస్తే వాస్తవానికి రాహుల్ ప్రచారానికి వెళ్తున్న విమానాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. నాల్గో దశలో అమేథి, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా ప్రచారానికి ఈ రోజు ఆఖరు కావడంతో శనివారం అమేథి ఎన్నికల ప్రచారానికి వెళ్తూ రాహుల్ కాన్పూర్ విమానాశ్రయానికి వచ్చారు. ప్రియాంక బారబంకి, ఉన్నవ్ రోడ్ షోలకు వెళ్తూ ఇక్కడకు వచ్చారు. 

cong lashes out at shah for Ilu-Ilu comment


అమిత్ షా ‘ఇలు ఇలు’ కామెంట్లపై కాంగ్రెస్ ధ్వజం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చేసిన ఇలు ఇలు కామెంట్ల పై ఆ పార్టీ ధ్వజమెత్తింది. అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్26) జలోర్ లో ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ కు ఉగ్రవాదులతో ఇలు ఇలు (ఐ లవ్ యూ  ప్రాచుర్యం పొందిన హిందీ సినిమా పాట) సంబంధముందంటూ వ్యాఖ్యలు చేశారు. 1999లో బీజేపీయే జైల్లోని ఉగ్రవాదుల్ని కాందహార్ కు తీసుకెళ్లి మరీ అప్పగించిందని గుర్తు చేస్తూ అమిత్ షాపై రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అవినాశ్ పాండే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్ఘానిస్థాన్ కు విమానాన్ని హైజాక్ చేసుకుని వెళ్లి ఉగ్రవాదులు డిమాండ్ చేయడంతో నాటి ఎన్డీయే ప్రభుత్వం వాళ్లు కోరిన విధంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మసూద్ అజర్ సహా ముగ్గురు కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. బీజేపీలోని మోదీ, అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు లేదా వారి కుటుంబసభ్యులు ఎవరైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారా? అని ప్రశ్నించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని మోదీ ప్రభుత్వం బలహీన పరుస్తోందన్నారు. సోషల్ మీడియాను వారు దుర్వినియోగం చేస్తున్నారని అవినాశ్ ఆరోపించారు. మరో 50 ఏళ్లు దేశాన్ని తామే పరిపాలిస్తామని మోదీ, అమిత్ షాలు గతంలో పేర్కొన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన రాజ్యాంగం ఎంతటి ప్రమాదంలో పడిందో గమనించాలని ప్రజల్ని కోరారు.

Friday, April 26, 2019

aviation regulator DGCA starts probe into rahul gandhi plane incident


రాహుల్ విమానంలో సాంకేతిక లోపంపై విచారణ

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన రాహుల్ విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ తిరిగి వచ్చారు. శుక్రవారం (ఏప్రిల్26) ఉదయం 10.20కి రాహుల్ ఢిల్లీ నుంచి హాకర్ 850 ఎక్స్.పి. (వి.టి-కె.ఎన్.బి) విమానంలో బయలుదేరారు. గాల్లోకి లేచిన కొన్ని నిమిషాల్లో ఇంజిన్ లో ఇబ్బందిని గుర్తించిన పైలట్లు విషయాన్ని రాహుల్ కు తెలిపి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. ఈ సాంకేతిక లోపం పై పౌర విమానాయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించారు. విధి విధానాల్లో భాగంగానే ఈ దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్లో కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి రాహుల్ వెళ్లిన సందర్భంలో హుబ్లీలో ఆయన విమానం ల్యాండ్ కావడానికి 20 సెకన్లు ఆలస్యమయింది. ఫాల్కన్ విమానంలో గతేడాది ఆయన ప్రయాణిస్తుండగా ఆకాశంలో 8000 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వాస్తవానికి ఆ సెకన్ల వ్యవధి కూడా విమాన పెను ప్రమాదానికి సంకేతం కాగలదు. అప్పుడూ ఆ సాంకేతిక లోపంపై దర్యాప్తు నిర్వహించారు. మరో వైపు తాజా ఇంజన్ లోపానికి సంబంధించి రాహుల్ ట్విట్ చేశారు. తన కోసం ప్రజలు వేచి చూస్తుంటారు కాబట్టి వారికి అసౌకర్యం కల్గకుండా జరిగిన విషయాన్ని తెల్పుతూ ట్విట్ చేయాల్సిందిగా విమానం లోని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.

history sheeter held for sexual abuse of school girl

చెన్నైలో బాలికను వేధించిన పోకిరి అరెస్ట్

పాఠశాల విద్యార్థినిని వేధించిన రౌడీషీటర్(20)ను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. 17 ఏళ్ల విద్యార్థిని(క్లాస్11)ని వేధిస్తున్న యశ్వంత్ రాజ్ అనే పోకిరిని లైంగిక వేధింపుల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద శుక్రవారం నిర్భందించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అతనిపై గతంలోనే రౌడీషీటర్ ఉన్నట్లు తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించింది. 

People of varanasi have again blessed me after five years pm modi

వారణాసి లో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున వారణాసి లోక్ సభ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్ 26) నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న మోదీ గురువారం భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే.  వారణాసి కలెక్టరేట్ లో ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఏన్డీయే భాగస్వామ్య పక్ష నేతలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన అగ్రనేత ఉద్దవ్ థాకరే, అన్నాడీఎంకె నాయకులు పన్వీర్ సెల్వం, ఎం.తంబిదురై, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు మోదీ వెంట ఉన్నారు. మోదీ నామినేషన్ ను నల్గురు ప్రతిపాదించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలుకు ముందు మోదీ కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో అయిదేళ్లు తనను ఎన్నుకోవడానికి వారణాసి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ అన్నారు. నేను, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యోగి ఆధిత్య నాథ్ కేవలం కరసేవకులం మాత్రమేనన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్ని ఓటర్లే ప్రతిపక్షాలతో పోరాడుతున్నాయని మోదీ అన్నారు. నిన్నటి రోజున వారణాసి రోడ్డు షో కు హాజరైన అశేష జన వాహినే అందుకు సాక్ష్యంగా పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మళ్లీ మోదీజీ పాలన అందిస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి. 

Thursday, April 25, 2019

parag archer take rr to winning side ipl season 12


రాజస్థాన్ చేతిలో కోల్ కతా చిత్తు
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన ఐపీఎల్ సీజన్12 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పట్టుదలగా ఆడి విజయాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన ఆర్ ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోలకతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ దినేశ్ కార్తిక్ (50 బంతుల్లో 9x6, 7x4) మాత్రమే రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జట్టులో తర్వాత నితీశ్ రాణా (21) చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్ ఆర్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలుపునందుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆర్.ఆర్. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ జట్టుకు ఇది నాల్గో విజయం. అజింక రహానే ఈ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడాడు. ఒక సిక్స్, అయిదు బౌండరీలతో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సంజు శ్యామ్ సన్ (22) అండగా నిలవడంతో 5.2 ఓవర్లలోనే ఓపెనర్లు 53 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశారు. రహానే అవుటయ్యాక 63 పరుగుల వద్ద శ్యామ్ సన్ వికెట్ ను జట్టు వెంటనే కోల్పోయింది. గెలుపు దోబూచులాడిన సమయంలో అయిదో బ్యాట్స్ మన్ గా వచ్చిన రియాన్ పరాగ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. విలువైన 47 పరుగులు చేసిన పరాగ్ 19 ఓవర్లో రస్సెల్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే ఆ ఓవర్లో సిక్సర్ సాధించడంతో ఆర్.ఆర్. జట్టు సురక్షితమైన స్థానంలోకి వచ్చింది. చివర్లో ఆర్చర్ (27) మురిపించాడు. ప్రదీప్ కృష్ణ బౌలింగ్ లో వరుసగా బౌండరీ, సిక్సర్ సాధించి కావాల్సిన 9 పరుగుల్ని రెండు బంతుల్లోనే సాధించి జట్టును విజయం ముంగిట నిలిపాడు. కేకేఆర్ జట్టుకు ఇది ఏడో ఓటమి.

pm narendra modi arrives at dashashwamedh ghat for ganga aarti


వారణాసిలో మోదీ రోడ్ షో ధూంధాం
ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్26) ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ఒకరోజు ముందు అట్టహాసంగా గురువారం ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ రోడ్ షోకు పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు. మోదీ.. మోదీ.. అంటూ పలుచోట్ల నినాదాలు మిన్నంటాయి. ఆయన వెంట ఎన్డీయే నాయకులు, బీజేపీ నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  బీజేపీ  అధ్యక్షుడు అమిత్ షా, పియూష్ గోయల్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితర పార్టీ అగ్ర నాయకులతో పాటు, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, బిహార్ సీఎం నితిశ్ కుమార్, లోక్ జన్ శక్తి అగ్రనేత రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు రోడ్ షో లో మోదీ వెంట ఉన్నారు. అనంతరం మోదీ దశాశ్వమేథ్ ఘాట్ వద్ద గంగా హారతికి హాజరయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ రాయ్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి బరిలో నిలుస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ గురువారం తమ అభ్యర్థిగా అజయ్ రాయ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. 2014లోనూ రాయ్ వారణాసి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడో స్థానంలో 75,614 ఓట్లు సాధించారు. మోదీ రికార్డు స్థాయిలో 5,81,022 ఓట్లు పొందగా ఆయనకు పోటీగా నిలిచిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  2,09,238 ఓట్లతో రెండో స్థానాన్ని పొందారు.


william receives traditional maori greeting from new zealand pm jacinda ardern


న్యూజిలాండ్ ప్రధానికి బ్రిటన్ రాకుమారుడు శుభాకాంక్షలు

బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్ గురువారం (ఏప్రిల్25) న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఆక్లాండ్లో ప్రధాని జకిండా అర్డెర్న్ తదితరులు విలియమ్స్ కు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ తరఫున సంప్రదాయ మావోరి (ముక్కు- ముక్కు రాసుకునే పండుగ) శుభాకాంక్షల్ని ప్రధాని అర్డెర్న్ కు విలియమ్స్ తెలియజేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విలియమ్స్ అంజక్ డే(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యుద్ధ వీరులు, శాంతికాముకుల స్మారక దినోత్సవం) వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో విలియమ్స్ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె. జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రధాని అర్డెర్న్ తో కలిసి విలియమ్స్ పౌర సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెల్లింగ్టన్ లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి నిలువెత్తు చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా గత నెలలో క్రైస్ట్ చర్చి మసీదుల్లో జరిగిన బాంబు దాడుల్లో గాయపడిన వారిని ఆయన ఆసుపత్రులకు వెళ్లి పరామర్శంచనున్నారు. క్రైస్ట్ చర్చి దాడుల్లో 50 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడంలో బ్రిటన్, న్యూజిలాండ్ చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని ప్రధాని అర్డెర్న్ పేర్కొన్నారు.

rupee tumbles 22 paise against dollar on crude concerns


రూపాయి 22 పైసల పతనం 70.08 డాలర్ తో మారకం
భారత్ రూపాయి తాజాగా గురువారం(ఏప్రిల్25) 22 పైసలు పతనమైంది. ఫారెక్స్ (ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్) మార్కెట్ ప్రకారం డాలర్ తో మారకంలో 70.08 పలుకుతోంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ కు డిమాండ్ రావడం ఇందుకు కారణం.  బుధవారం కూడా రూపాయి 24 పైసలు పతనమై డాలర్ తో మారకంలో 69.86 వద్ద నిలిచింది. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ద్రవ్యోల్బణమూ రూపాయి పతనానికి కారణంగా భావిస్తున్నారు. ఇలాగే ముడి చమురు ధరలు పెరుగుదల కొనసాగితే ఆ ప్రభావం ఆయా దేశాల కరెన్సీ విలువలు మరింత దిగజారే ప్రమాదముంది.

Wednesday, April 24, 2019

ec orders removal of mamata`s biopic trailer


మమతా బయోపిక్ ట్రైలర్ నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ నాయకుల బయోపిక్ ల గోల కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈసీ పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ జీవిత గాథపై నిర్మితమైన బాఘిని సినిమా ట్రైలర్ ప్రసారాల్ని నిలిపివేస్తూ బుధవారం (ఏప్రిల్ 24) ఉత్తర్వులచ్చింది. ఆ సినిమా నిర్మాతలకు దీంతో పెద్ద షాక్ తగిలినట్టయింది. ఈ విషయమై మమతా ట్విట్ చేస్తూ ‘ఏమిటీ బాఘిని ట్రైలర్ రచ్చ.. ఆ సినిమాకు నాకూ సంబంధం లేదు. ఔత్సాహికులు కథ సిద్ధం చేసుకుని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినిమా తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు నాకు ముడిపెడుతూ అబద్ధాలు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఆమె హెచ్చరించారు. అంతకుముందు సీపీఐ(ఎం), బీజేపీ ఈ సినిమా నిలిపివేత గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) విన్నవించాయి. బాఘిని సినిమా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్లు ఆ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను నిలిపివేస్తూ ఈసీ  ఆదేశాలు జారీ చేసింది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన ఓ వ్యక్తి స్ఫూర్తివంతమైన యథార్థ గాథగా మాత్రమే బాఘినిని తెరకెక్కించినట్లు ఈ సినిమా నిర్మాతలు పేర్కొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఈ బయోపిక్ తీశారని బీజేపీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మోదీ బయోపిక్ విడుదలను వ్యతిరేకించిన మమతా బెనర్జీ తన జీవితగాథ చిత్రంపై వ్యవహరిస్తున్న తీరును బట్టే ఆమె నైజం తేటతెల్లమౌతోందని విమర్శించింది. మరోవైపు బాఘిని నిర్మాతలు తమ చిత్రం మే3న విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిశాకే మోదీ బయోపిక్ విడుదలని ఈసీ ఇంతకుముందే ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం బాఘిని విడుదల కూడా లేనట్లే స్పష్టమౌతోంది.

Tuesday, April 23, 2019

india warned sri lanka of serial bomb threat hours before suicide attacks

భారత్ అప్రమత్తం చేసినా.. పెడచెవిన పెట్టిన శ్రీలంక


  •  బాంబు పేలుళ్లకు రెండు గంటల ముందే సమాచారం అందజేత

  •    ఘాతుకం తమ పనేనన్న ఐఎస్ఐఎస్


శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల పీడకల రోజులు గడుస్తున్నా ప్రపంచ దేశాల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా పొరుగుదేశమైన శ్రీలంకతో భారత్ కు చారిత్రక సాంస్కతిక సంబంధాలు ముడిపడి ఉన్నాయి. దారుణ మారణహోమానికి సంబంధించి భారత్ రోజుల ముందుగానే శ్రీలంకను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 4వ తేదీనే భారత్ నిఘా వర్గాలు సమాచారాన్ని శ్రీలంక అధికార వర్గాలకు అందజేశాయి. అలాగే ఏప్రిల్21న పేలుళ్లకు రెండు గంటల ముందు కూడా అక్కడ రక్షణ శాఖకు ఉప్పందించాయి. అయినా అప్రమత్తం కాకపోవడంతోనే శ్రీలంక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అవుననే శ్రీలంక అధికారిక వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ప్రభుత్వ వర్గాలు భారత్ హెచ్చరికల్ని పెడచెవిన పెట్టడంపై క్షమాపణ వేడుకున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీలంక అధ్యక్ష భవనం, భారత విదేశాంగ శాఖ నోరు విప్పడం లేదు. ఆదివారం ఈస్టర్ సండే నాడు వేర్వేరు ప్రాంతాల్లోని చర్చిలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎనిమిది శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలుళ్లు జరగ్గా మృతుల సంఖ్య 321కు పెరిగింది. ఇంకా వందలమంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని సిరియా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ ఇంకా లభ్యం కాలేదని సమాచారం.

twitter's user numbers are growing again reports surprising usage

ఆశ్చర్యకరంగా పెరిగిన ట్విటర్ ఖాతాదారులు

·         గత ఏడాదితో పోలిస్తే 18% పెరుగుదల
·         త్రైమాసిక ఆదాయం రూ.1,300 కోట్లు
సామాజిక మాధ్యమం ట్విటర్ ఖాతాదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఖాతాదారుల సంఖ్యలో పెంపుదల కనిపించింది. 2019 తొలి త్రైమాసికంలో ఆదాయం 18 శాతం పెంపును నమోదు చేసినట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) జాక్ డొర్సి తెలిపారు. ఆదాయం రూ.1300 కోట్లు చేకూరిందట. ఖాతాదారుల సంఖ్య 13.40 కోట్లకు పెరిగి మొత్తంగా 33 కోట్ల 30 లక్షలకు చేరింది. అడ్వర్టయిజ్ మెంట్ ల ఆదాయం గణనీయంగా పెరగడంతో మొత్తం ఆదాయం 18 శాతం పెంపుతో రూ.67కోట్ల90లక్షల మార్క్ ను అందుకుంది. అయితే కంపెనీ ఎనలిస్టుల అంచనా ప్రకారం ఆదాయం పెంపు నమోదు కాలేదని తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక పెంపుదల రూ.77 కోట్ల నుంచి రూ.83 కోట్లు ఉండొచ్చని భావించారు. ట్విటర్ సంస్థను జాక్ డొర్సీ, నొహ్ గ్లాస్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్ లు 2006 మార్చి 21న అమెరికా కాలిఫోర్నియా (శాన్ ఫ్రాన్సిస్కో)లో ప్రారంభించారు. ఈ పదమూడేళ్లలో సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచం నలుమూలలా విస్తరించి ఖాతాదారుల మన్ననలు చూరగొంటోంది. రోజూ 10 కోట్ల మంది యూజర్లు 34 కోట్ల ట్విట్లను చేస్తున్నారు.

here he is now with a t20 ton ajinkya rahane slams his second ipl century


ఢిల్లీని గెలిపించిన శిఖర్, పంత్

·        రహానే సెంచరీ వృథా  ·        6 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓటమి

జైపూర్ లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పై ఢిల్లీ కేపిటల్స్(డీసీ) విజయం సాధించింది. టోర్నీలో నాల్గో అర్ధ సెంచరీ చేసిన శిఖర్ ధావన్(27 బంతుల్లో 54) కు రిషబ్ పంత్ (36 బంతుల్లో 78పరుగులు) తోడవడంతో తేలిగ్గా గెలుపునందుకుంది. తొలి వికెట్ కు ధావన్, పృథ్వీషాల జోడి 72 పరుగులు చేసింది. పంత్ 2x6, 6x4 సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం నాలుగు వికెట్లనే కోల్పోయిన డీసీ లక్ష్యం 192 పరుగుల్ని ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే సాధించింది. టాస్ గెలిచిన డీసీ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ ఆర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్సీ బాధ్యతల తప్పడంతో బ్యాటర్ గా రహానే పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. 11 బౌండరీలు 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్లో రెండో సెంచరీని సాధించాడు. కెప్టెన్ స్మిత్ అర్ధ సెంచరీతో రాణించాడు. రబాడ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ లోపాలు కూడా డీసీ సునాయాస విజయానికి దోహదం చేశాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో ప్రస్తుతం డీసీ నెం.1 స్థానానికి చేరుకుంది.

Monday, April 22, 2019

chennai two cars go up in flames cause of malfunctioned

పెట్రోల్ కారులో డీజిల్ కొట్టడంతో రెండు కార్లు దగ్ధం

చెన్నైలో పొరపాటున ఓ వ్యక్తి తన పెట్రోల్ కారుకు డీజిల్ కొట్టించాడు. దాంతో అతని కారుకు మంటలంటుకుని పక్కనే ఉన్న మరో కారుకు వ్యాపించడంతో రెండూ దగ్ధమైన ఘటన చెన్నైలో జరిగింది. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11కు ఈ ఘటన జి.ఎన్.శెట్టి రోడ్డులో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ప్రయివేటు బ్యాంక్ లో పనిచేస్తున్న రమేశ్ తన కారులో ఇంధనం పోయించడానికి వెళ్లాడు. అక్కడ బంక్ లో డీజిల్ కొట్టారు. కారు ట్రబుల్ ఇస్తుండగా రాత్రి ఎలాగోలా తను నివాసముంటున్న కెనరా బ్యాంక్ కాలనీకి తిరిగి వచ్చి దగ్గర్లో గల టీనగర్ లో కారును పార్క్ చేశాడు. సోమవారం మెకానిక్ ని తీసుకు వచ్చి చూపించాడు. అతని ద్వారా కారులో డీజిల్ పోసిన విషయం గ్రహించాడు. ఇంతలోనే కారు నుంచి పొగలు వస్తుండడాన్ని వారు గమనించారు. అంతలోనే కారులో మంటలు ఎగసి పడ్డాయి. పక్కనే పార్క్ చేసి ఉన్న మాధవన్ అనే వ్యక్తి కారుకు జ్వాలలు వ్యాపించడంతో రెండు కార్లూ తగలబడిపోయాయి.



karnataka cid team in raichur to investigate btech girl`s death


బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సీఐడీ దర్యాప్తు
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన 23 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డను పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళం విప్పడంతో ప్రభుత్వం ఈ దర్యాప్తునకు ఆదేశించింది. నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి ఏప్రిల్13న వెళ్లిన విద్యార్థిని జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఏప్రిల్ 15న ఓ ఫామ్ హౌస్ లో చెట్టుకు ఉరి వేసిన స్థితిలో విద్యార్థిని శవాన్ని కనుగొన్నారు. తొలుత పోలీసులు సైతం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే తమ బిడ్డను అదే కాలేజీలో చదువుతున్న సుదర్శన్ యాదవ్ అత్యాచారం చేసి చంపేసి సూసైడ్ డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపించారు. ఈ సుదర్శన్ బంధువు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండడంతో కేసును మాఫీ చేసే ప్రయత్నం చేశాడన్నారు. విద్యార్థిని తను పరీక్షలో ఫెయిల్ కావడంతోనే మనస్థాపంతో ఉరివేసుకుంటున్నట్లు నకిలీ సూసైడ్ నోట్ ను సుదర్శన్ సృష్టించాడని పేర్కొన్నారు. దాంతో ప్రభుత్వం సీఐడీ ఎస్.పి. శరణప్ప ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు సోమవారం ఆదేశాలిచ్చింది.



sri lanka receives brand new type of terrorism bombings death toll raises to 290 hurted 500 people


శ్రీలంకలో కొత్త తరహా ఉగ్రవాదం 


  • 290కు పెరిగిన మృతుల సంఖ్య 
  • 500 మందికి గాయాలు

శ్రీలంకలో దశాబ్దం తర్వాత భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. జాతుల సమరంలో నిత్యం రక్తమోడిన దేశం పదేళ్లుగా దాదాపు ప్రశాంతంగా ఉంది. ఆదివారం (ఏప్రిల్21) మళ్లీ రక్త చరిత్ర ప్రపంచం ముందు సాక్షాత్కారమయింది. పర్యాటక ప్రాంతాలు, విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు తాజా బాంబు పేలుళ్లకు తెగబడిన నేపథ్యంలో మృతుల సంఖ్య 290కు పెరగింది. అంతకు దాదాపు రెట్టింపు సంఖ్యలో 500 మందికి పైబడి క్షతగాత్రులయ్యారు. ఆదివారం ఉదయం నుంచి చర్చిలు, స్టార్ హోటళ్లు ఎనిమిది చోట్ల ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు బరితెగించింది. దాంతో దేశంలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. విమాన, రైలు, బస్ తదితర అన్ని రవాణా వ్యవస్థల్ని నిలిపివేసింది. దేశం నలుమూలలా ముమ్మర గాలింపు చేపట్టింది. అనుమానితులు 24 మందిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాజధాని కొలంబోలోని బండారు నాయకే విమానాశ్రయంలో ఓ బాంబు పేలకుండా భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. మొత్తంగా తొమ్మిది చోట్ల బాంబు(ఐ.ఇ.డి)లు ఉగ్రవాదులు అమర్చగా ఆఖరి బాంబును పేలకుండా నిర్వీర్యం చేసినట్లు సమాచారం. మొహ్మద్ సాహారన్ నాయకత్వంలోని జాతీయ తవాహిద్ జమాన్(ఎన్ టీ జే) ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పున్నట్లు నిఘా వర్గాలు ముందుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ముందుగానే ఉప్పందినా ప్రభుత్వ ఉదాసీనత కారణంగా శ్రీలంక భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
భారత్ లో హైఅలర్ట్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఓ వైపు జరుగుతుండగా శ్రీలంక లో ఉగ్రవాదులు చెలరేగిపోయిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో సుమారు ఏడుగురు భారతీయులు చనిపోయినట్లు రాయబార కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని విక్రమ్ సింఘేలతో ఫోన్ లో మాట్లాడారు. బాంబు దాడుల్ని తీవ్రంగా ఖండించి శ్రీలంక కు అవసరమైన సాయాన్ని అందించడానికి ముందుంటామని హామీ ఇచ్చారు. దాడులు ఆటవిక చర్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ ఇవి ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన పేలుళ్లగా పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుగా చెప్పారు. ఇది ఓ దేశానికో ప్రాంతానికో కాక యావత్ ప్రపంచానికి సంబంధించిన పెను సమస్యని మోదీ పేర్కొన్నారు. శ్రీలంక-భారత మధ్య దూరం కేవలం 18 కి.మీ ఉండడంతో తమిళనాడు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Sunday, April 21, 2019

msdhoni career best in vain rcb beat csk in thriller ipl-12


ఆఖరి బంతికి ఆర్ సీ బీ విజయం


§ శివమెత్తిన ధోని..చివరి ఓవర్లో 24పరుగులు చేసినా తప్పని ఓటమి


   బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మరోసారి ఉత్కంఠ పోరుకు వేదికయింది. ఆదివారం ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ లో అజేయంగా దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్ కే)ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీ బీ) ఒక్క పరుగు తేడాతో ఓడించింది. ఆర్ సీబీకి వరుసగా ఇది రెండో విజయం. టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో ఆర్ సీబీ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ 7 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 37 బంతుల్లో అర్థ సెంచరీ 53 సాధించాడు. ఏబీ డివిలియర్స్(25), అక్షదీప్ నాథ్(24), మొయిన్ అలీ(26) రాణించారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్ కే వికెట్లు టపటపా పడిపోయాయి. 6-1, 6-2,17-3, 28-4 ఈ సంఖ్యలను చూస్తేనే డగ్ ఔట్ కు చేరాలనే సీఎస్ కే బ్యాటర్ల తొందర తెలుస్తుంది. డుప్లెసిస్, కేదార్ జాదవ్ లు అవుటయ్యారనే కంటే వికెట్లను పారేసుకున్నారంటే సబబుగా ఉంటుంది. క్రీజ్ లో ఉన్న రాయుడుతో ధోని జత కలిశాకే చెన్నై ఇన్నింగ్స్ కుదురుకుంది. అంతకు మించి బెంగళూరు సీమర్లు లైన్ అండ్ లెంగ్త్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాట్స్ మన్ ను కట్టిపడేశారు. చక్కగా ఆడుతున్న రాయుడు(29) పెవిలియన్ కు చేరినా మ్యాచ్ ఫినిషర్ ధోని ఉండడంతో సీఎస్ కే ఆశలు సజీవంగా ఉన్నాయి. చివర్లో బ్రావో(5) కెప్టెన్ ధోనికి జత కలిశాడు. ఆఖరి 6 బంతుల్లో 26 పరుగులు చేయాలి. ధోని స్ట్రైకింగ్ లో ఉన్నాడు. తొలి బంతినే బౌండరీకి తరలించిన ధోని తర్వాత మూడు సిక్సర్లూ బాదాడు. ఒక సిక్సరయితే బంతి స్టేడియం బయటకు వెళ్లిపోయింది. చివరి బంతికి రెండు పరుగులు లేదా ఒక్కపరుగు చేస్తే సూపర్ ఓవర్.. ఉమేశ్ స్లో బాల్ వేయడంతో బైస్ రన్ కోసం ధోని పరిగెత్తుతూ ముందుకు వచ్చాడు. శార్దుల్ ను ఆర్ సీ బీ వికెట్ కీపర్ అద్భుతమైన త్రో తో రనౌట్ చేశాడు. దాంతో బెంగళూరు విజయదరహాసం చేసింది. స్కిపర్ ధోని 84 (48 బంతుల్లో 7x6, 5x4) నాటౌట్ గా నిలిచాడు. చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేయగల్గింది. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ కు అవకాశాన్ని నిలుపుకుంది.

srilanka six blasts hit three churches three five star hotels as 140 killed over 400 injured

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు.. సినీ నటి రాధికకు త్రుటిలో తప్పిన ముప్పు

శ్రీలంక ఆదివారం(ఏప్రిల్21) బాంబు పేలుళ్లతో రక్త సిక్తమైంది. రాజధాని కొలంబో సహా నెగొంబొ, బట్టికలొవా ల్లోని చర్చిలు, స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లకు 140 మందికి పైగా దుర్మరణం చెందారు. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈస్టర్ సండే సందర్భంగా క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం 8.45 సమయంలో బాంబు పేలుళ్లు మొదలయినట్లు పోలీసు అధికారి రువాన్ గుణశేఖర తెలిపారు. మొత్తం ఆరు భారీ బాంబు విస్ఫోటనాలు సంభవించాయి. దాంతో మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు రక్తసిక్తమయ్యాయి. కొలంబోలో 42 మంది, నెగొంబొలో 60 మంది, బట్టికలొవాలో 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు. మృతులు, క్షతగాత్రుల్లో పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఈ పాశవిక బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఏ ఉగ్ర సంస్థ ఇంకా పేర్కొనలేదు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని దర్యాప్తు లో కుట్ర కోణం వెలుగుచూడగలదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జాతుల సమస్యతో దశాబ్దాల పాటు నెత్తురోడిన శ్రీలంకలో ఇటీవల కాలంలో ఇంత పెద్దఎత్తున మారణహోమం జరగడం ఇదే తొలిసారి.
షాక్ కు గురైన నటి రాధిక 
తమిళ సినీ నటి రాధికా త్రుటిలో వరుస బాంబు పేలుళ్ల నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. కొలంబోలోని స్టార్ హోటల్ సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో రాధికా బస చేశారు. ఈ హోటల్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుకు కొద్ది నిమిషాలు ముందే ఆమె బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన పట్ల రాధికా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆ తర్వాత విలేకర్లకు తెలిపారు.

Saturday, April 20, 2019

anna hazare says sweeping electoral reforms needed to end malpractices

సమూలంగా ఎన్నికల సంస్కరణలు అవసరం: హజారే
దేశంలో ఎన్నికల అక్రమాలు అరికట్టడానికి సమూలంగా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ప్రముఖ సామాజిక సేవ, ఉద్యమకర్త అన్నా హజారే అభ్రిపాయపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్లు మూల స్తంభాలన్నారు. ప్రస్తుత రాజకీయాల వల్ల అటు పార్లమెంట్, అసెంబ్లీల పవిత్రత అడుగంటిపోతోందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీలు, గుర్తులతో పోటీ ఎందుకన్నారు. భారత సంవిధానంలో ఎక్కడా పార్టీలు, గుర్తుల ప్రస్తావన లేదని కేవలం వ్యక్తి(నాయకుడు) అని మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు రాశారని హజారే గుర్తు చేశారు. 25 ఏళ్లు నిండిన భారతీయ పౌరులెవరైనా పోటీ చేయొచ్చన్నారు. ప్రజల్ని ఏదోవిధంగా మభ్యపెట్టి డబ్బు ఎరవేసి లోబర్చుకుని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు, గుర్తుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) పలుమార్లు మనవి చేసినా స్పందన లేదని చెప్పారు. ప్రధాని మోదీకి అనేక అంశాలపై 32 లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లోక్ పాల్ దృష్టికి కూడా ఎన్నికల అవకతవకల విషయాన్ని తీసుకెళ్లానన్నారు. కచ్చితంగా ఈ అక్రమ దందాకు ఏదో ఒక రోజు చరమగీతం పాడగలమని హజారే ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా ఈనెల 23న అహ్మద్ నగర్(మహారాష్ట్ర) లో ఓటు హక్కు వినియోగించుకుంటానని 81 ఏళ్ల హజారే తెలిపారు. సరైన అభ్యర్థికే ఓటు వేస్తానని లేదంటే నోటా (none of the above)  బటన్ నొక్కుతానని చెప్పారు.

judiciary is under threat says chief justice after reports of harassment allegations against him


న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉంది: సీజేఐ గొగొయ్
దేశంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగొయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మహిళ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది.  సీజేఐ గొగొయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ఏ విధమైన ఆర్డర్ ఇవ్వకుండా విడిచిపుచ్చింది. ‘ఇది నమ్మలేకపోతున్నా..ఇంత చౌకబారు ఆరోపణలు ఎదుర్కొంటానని నేనెన్నడూ ఊహించలేదు’ అని గొగొయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘20 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా అవిశ్రాంతంగా పని చేశాను.. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.80 లక్షలు మాత్రమే.. ఏరోజూ అవినీతికి పాల్పడ లేదు..ఇదేనా భారత ప్రధానన్యాయమూర్తిగా నాకు ఇచ్చే రివార్డు’ అని ప్రశ్నించారు. ఈ నీచమైన ఆరోపణలు చేసిన మహిళపై పోలీస్ స్టేషన్లో రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ప్రస్తుత పోకడలు న్యాయ వ్యవస్థను  బలి పశువును చేసేలా తయారయ్యాయని కానీ అలా ఎన్నటికీ జరగదని గొగొయ్ పేర్కొన్నారు. సీజేఐపై మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఏదో ఆశించి చేస్తున్న బెదిరింపు (బ్లాక్ మెయిల్)గా కనిపిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.


Friday, April 19, 2019

storming knock by russells again even though rcb won the match


రస్సెల్ తుపాను.. ఒడ్డునపడ్డ బెంగళూరు
·    కెప్టెన్ కోహ్లీ సెంచరీ, మొయిన్ అర్ధ సెంచరీలతో కోల్ కతాపై గెలుపు
ఐపీఎల్ సీజన్-12 రియల్ హీరో తనేనని ఆండ్రూ రస్సెల్ మరోసారి నిరూపించుకున్నాడు. కోలకతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్.)కు ఘోరమైన ఓటమి తప్పదనుకున్న దశలో ఫీల్డ్ లోకి వచ్చిన రస్సెల్ మళ్లీ విధ్వంసమే సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 25 బంతుల్లో 9 సిక్సర్లు, 2 బౌండరీలతో 65 పరుగులతో దాదాపు జట్టును గెలిపించనంత పని చేశాడు. బాధ్యతగా ఆడిన నితీష్ రాణా 46 బంతుల్లో 5 సిక్సర్లు, 9 ఫోర్లతో 85 అతి విలువైన పరుగులు చేశాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ సెకండ్ డౌన్ లో రాబిన్ బదులు రస్సెల్ ను పంపి ఉంటే కచ్చితంగా కోలకతా గెలిచేది. రస్సెల్, రాణాలు పరుగుల వరద పారించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. కోలకతా అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులే చేయగల్గింది. కేవలం 10 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సీబీ 213/ 4 పరుగులు చేసింది. కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో కోహ్లీకిది అయిదో సెంచరీ. మొయిన్ అలీ కూడా అద్భుతంగా ఆడి 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. కేకేఆర్ టీంలో స్టార్ స్పిన్నర్ కులదీప్ ఓవర్ లో అలీ ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ పరుగుల వేటలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. రస్సెల్ వచ్చే వరకు ఆ జట్టు స్కోర్ బోర్డులో ఒక్క సిక్సర్ కూడా లేదు. రస్సెల్ క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి సిక్సర్ల మోతే. అతని స్ఫూర్తితో రాణా కూడా నేనూ కొట్టగలను అన్నట్లుగా వరుస సిక్సర్ల తో విరుచుకుపడ్డాడు. అయితే రస్సెల్ బ్యాటింగ్ దూకుడుకు 60 వేల మంది ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. ప్రేక్షకుల గ్యాలరీ లో కూడా రస్సెల్ కోసం మరో 10 మంది ఫీల్డర్లను మోహరించిలన్నంతగా అతని బ్యాటింగ్ సాగింది.

will priyanka go to contest in varanasi constituency against prime minister modi


ప్రియాంక వారణాసిలో ప్రధాని మోదీతో పోటీపడతారా?
2019 సార్వత్రిక ఎన్నికల వేడిలో అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం వారణాసి ఎన్నిక. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారా లేదా అనే అంశమే రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ప్రధాని మోదీ తొలిసారిగా లోక్ సభకు ఇక్కడ నుంచే బరిలో నిలిచి విజయం సాధించారు. నయా ఇందిరమ్మగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రియాంక వారణాసి నుంచి బరిలోకి దిగితే మాత్రం పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం. దిగ్గజం పై మరో దిగ్గజం పోటీ చేస్తున్న నియోజకవర్గం పైనే మొత్తం దేశం కళ్లు కేంద్రీకృతమౌతాయి. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని ప్రియాంక అంటుండగా అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్కంఠకు తెరదించడం లేదు. పైగా సస్పెన్స్ కొనసాగించడం తప్పేమీ కాదంటూ చలోక్తులు విసురుతున్నారు.
నెహ్రూ-గాంధీ వంశాంకురమైన ప్రియాంక ఇటీవలే పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు వరకు ఆమెది కేవలం ప్రచారకర్త పాత్రే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ (యూపీ) కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గాను వ్యవహరిస్తూ ఆమె పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. స్వయంగా ఆమె బరిలోకి దిగితే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మరోవైపు ప్రధాని మోదీ దేశంలో తిరుగులేని నాయకుడు. ఇందిరాగాంధీ తర్వాత అంతటి సమర్ధుడిగా పేరు. ముమ్ముర్తులా ఇందిరనే పోలిన ప్రియాంక పోటీకి దిగితే వీరిద్దరి ముఖాముఖి 2019 ఎన్నికల చిత్రానికి కొత్త రూపును తెస్తుంది. మోదీ, ప్రియాంకలు ఉభయులకూ అవినీతి అంశమే ప్రధాన ప్రచారాస్త్రం. తాజా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఈ అంశంపై రెండుపార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
రాఫెల్ ఒప్పందం గురించి ప్రియాంక ప్రస్తావిస్తే అక్కడ ఎన్నికల ప్రచారం మరింత సెగలు రేపుతుంది. రాబర్ట్ వాద్రా (డీఎల్ ఎఫ్ కేసు) భుజాల మీదుగా తుపాకీ ఎక్కుపెట్టి మరీ మోదీ ఆమెపై ఎదురుదాడికి దిగుతారు. ప్రచార సభల్లో, ఓటర్లను కలిసి మాట్లాడిన సందర్భాల్లో ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వారి శైలే వేరు. వేదికలపై ప్రసంగించినప్పడు, జనంతో మమేకమైనప్పుడూ హుందాతనమే కనిపిస్తుంది. మాట, చేతల్లో సామాన్యుల్లో కలగలిసి పోతుంటారు. ప్రస్తుతం ప్రియాంక ప్రచార పర్వం అదే రీతిలో సాగుతోంది. ఇటీవల అలహాబాద్ నుంచి వారణాసికి గంగా(బోటు)యాత్రలో పర్యటించిన ప్రియాంక తన నాయనమ్మతో ఆనంద్ భవన్ (అలహాబాద్)లో గడిపిన మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుని ఓటర్లలో సెంటిమెంట్ రగిలించారు. ముఖ్యంగా మోదీకి ప్రత్యామ్నాయం తామేనని తెల్పడమే ప్రధాన ఉద్దేశంగా ప్రియాంక పోటీ చేస్తున్నట్లు స్పష్టమౌతోంది.
 1952 నుంచి ఇంతవరకు ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ అత్యధికంగా ఏడుసార్లు విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఆరుసార్లు, సీపీఎం, భారతీయ లోక్ దళ్, జనతాదళ్ ఒక్కోసారి  గెలిచాయి.  2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(2,09,238 ఓట్లు)పై మోదీ(5,81,022 ఓట్లు) ఘన విజయం సాధించారు. ఆనాడు మోదీపై పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కేజ్రీవాల్ వారణాసి బరిలో నిలిచారు. ఈ సారి ఇక్కడ మే19న ఎన్నిక జరగనుంది.
దిగ్గజాలపై దిగ్గజాలు పోటీ పడిన సందర్భాలు గతంలోను తాజాగానూ కొనసాగుతున్నాయి. 1984లో గ్వాలియర్ నుంచి వాజ్ పేయి పై పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో బళ్లారి నుంచి సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై పోటీ పడి ఓడిపోయారు. ప్రస్తుతం అమేథి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీ చేతిలో పరాజయం పాలయ్యారు.