Tuesday, November 12, 2019

President rule in Maharastra today onwards


`మహా`లో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తక్షణం రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికలు ఫలితాలు విడుదలై 19రోజులు గడిచినా బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాలేకపోవడంతో గవర్నర్ నివేదన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తాము తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరింత గడువు ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కోష్యారి సిఫార్సు చేయడంపై శివసేన నిప్పులు చెరిగింది. ఇందుకు సంబంధించి శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన 56 స్థానాలు దక్కించుకోగా ఎన్సీపీ 54, పొత్తు పార్టీ కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు 29 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. బీజేపీ-శివసేనలు చెరి రెండేళ్లు సీఎంగా అధికారం చలాయించడంపై నెలకొన్న ప్రతిష్టంభనతో తాజాగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెరపైకి వచ్చింది. ఎన్నికల పొత్తు సమయంలోనే తాము ఈ మేరకు ప్రతిపాదిస్తే బీజేపీ అంగీకరించిందని శివసేన పేర్కొంటోంది. అందుకు ప్రస్తుతం బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఏ పార్టీకి తగిన సంఖ్యాబలం లేక ప్రభుత్వాన్ని స్థాపించలేక పోయాయి. ఇదిలావుండగా గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించింది. మంగళవారం ఏఐసీసీ సమాచార శాఖ ఇన్ చార్జీ రణ్ దీప్ సింగ్ సుర్జీవాలా విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్ వైఖరిని ఘాటుగా విమర్శించారు. సీపీఎం పోలిట్ బ్యూరో కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తీవ్రంగా ఖండించింది.