మార్చిలో తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు!
తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక మార్చిలో జరగవచ్చని తెలుస్తోంది. ఆ మేరకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. దాంతో టీఎస్ లో మరో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సీటును పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు. మరోసారి అలా జరగకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు మార్చిలో ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.