Friday, November 22, 2019

Sri Lanka's new president picks his brothers into the interim cabinet

మధ్యంతర కేబినెట్‌ను నియమించిన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
శ్రీలంక నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం తాత్కాలిక కేబినెట్‌ను నియమించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన మధ్యంతర కేబినెట్ లోకి తన ఇద్దరు సోదరులను తీసుకున్నారు. కొత్త కేబినెట్‌లో ప్రధాని పదవికి ఎంపికైన మహీంద రాజపక్స(74)ను రక్షణ, ఆర్థిక మంత్రిగా కూడా నియమించారు. సోదరులలో పెద్దవాడు చమల్ రాజపక్స(77)ను వాణిజ్య, ఆహార భద్రత మంత్రిగా ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల మంత్రివర్గంలో వీరితో పాటు ఇద్దరు తమిళులు, ఒక మహిళ ఉన్నారు. ప్రముఖ మార్క్సిస్ట్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధన (70) విదేశాంగ మంత్రిగా ఎంపికయ్యారు. ప్రస్తుత పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేసి తాజా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లే వరకు ఈ కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు జరగాల్సి ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయకపోతే ఆయనను తొలగించలేరు. అలాగే దేశాధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్సే కేబినెట్ అధిపతి అయినప్పటికీ మంత్రిత్వ శాఖలను నిర్వహించలేరు. సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా గడువుకు ముందే తాజా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన మధ్యంతర కేబినెట్ నియామకాన్ని చేపట్టారు. శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 52 ఏళ్ల సజిత్ ప్రేమదాసను 13 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. గతంలో గోటబయ సైనిక బలగాల అధినేతగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దేశం  పార్లమెంట్ ఎన్నికల ముంగిట నిలిచిందని స్పీకర్ కరు జయసూర్య ఇటీవల పేర్కొనడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నారు. `ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీగా, పార్లమెంటరీ ఎన్నికల గురించి పార్లమెంట్ సభ్యులు, స్పీకర్, పార్టీ నాయకులతో చర్చిస్తాం` అని విక్రమసింఘే కార్యాలయం సోమవారమే ఒక ప్రకటన జారీ చేసింది.