Wednesday, August 7, 2019

Prez, PM, Sonia among hundreds who pay homage to Swaraj at her residence


సుష్మా స్వరాజ్ కు నేతల కన్నీటి వీడ్కోలు
భారత మాజీ విదేశాంగశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్ (67)కు దేశ విదేశాలకు చెందిన నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా (కార్డియక్ అరెస్ట్-గుండె ఆగిపోవడం) మరణించారు. అంతకు కొద్ది సేపు క్రితం కూడా జమ్ముకశ్మీర్ దేశంలో పరిపూర్ణంగా విలీనమైనందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా దేశ ప్రధాని, హోంమంత్రులు మోదీషాల్ని అభినందిస్తూ చిరకాల స్వప్నాన్ని ఈరోజు నిజం చేశారంటూ ప్రశంసించారు. సమాచారం అందగానే పార్టీలకతీతంగా నేతలు బుధవారం ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ నివాసానికి చేరుకుని ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. సుష్మా మరణవార్త విని ఆమె గురువు బీజేపీ అగ్రనేత అద్వానీ తల్లడిల్లిపోయారు. కంటతడి పెడుతూ ఆమెతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సుష్మా తన ప్రతిపుట్టిన రోజుకు వచ్చి ఇష్టమైన చాక్లెట్ కేక్ ఇచ్చి వెళ్లేవారంటూ అద్వానీ గుర్తు చేస్తుకున్నారు. తమ పార్టీలోకి యువకెరటంలా వచ్చిన సుష్మా అనంతర కాలంలో అత్యున్నతమైన నేతగా ఎదిగారన్నారు. ఉగాండా అధ్యక్షులు మరియా ఫెర్నాండ ఎస్పినోస నివాళులర్పించారు. సుష్మా జీవిత కాలం ప్రజాసేవకు అంకితమైన ఓ గొప్ప నేతగా సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి, హోంమంత్రి అమిత్ షా, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం నాయకులు బృందా కారత్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ తదితరులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానుల కడసారి నివాళుల కోసం సుష్మా పార్థివ దేహాన్ని ఆమె ఇంటి నుంచి తరలించి కొద్దిసేపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అనంతరం లోదీ రోడ్ లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియల్ని నేతలు, అభిమానులు అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.