దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సోమవారం ఉదయం 10.15కి ఆమెతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ముర్ముతో పాటు, సీజేఐ జస్టిస్ రమణ, రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లా ఆశీనులయ్యారు. వేదిక కింద ముందు వరుసలో ప్రధాని నరేంద్రమోదీ, సోనియాగాంధీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రతిభాపాటిల్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, స్మృతి ఇరానీ తదితరులు కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఈ ఉదయం 8.30కి ముర్ము రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధిని సందర్శించి జాతిపితకు నివాళులర్పించారు. అనంతరం ఆమె తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కు విచ్చేశారు. ఆమెను సెంట్రల్ హాల్ లోని ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ, ఓం బిర్లా తోడ్కొని వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత ముర్ము మాట్లాడుతూ ఆజాదికీ అమృత మహోత్సవాలు జరుగుతున్న వేళ భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టడంతో అమితానందం కల్గుతోందన్నారు. ఇందుకు దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా నీటిపారుదల శాఖలో ఓ సాధారణ క్లర్కుగా జీవితం ప్రారంభించిన ఆమె దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి చేరుకున్నారు. రాజకీయాల్లో తను కౌన్సిలర్ స్థానం నుంచి రాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం ముదావహమని ముర్ము అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనానికి ఇదే నిదర్శనమని సగర్వంగా ప్రకటించారు. ప్రపంచంలోనే భారత్ ఓ అమేయశక్తిగా అవతిరించిందని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లల్లో దేశం మరింతగా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు అందరూ సహకరించాలన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.