Friday, July 19, 2019

Tiger Found Resting On A Bed In A Shop In Assam


పాపం ఆ పులి అలసిపోయి.. ఓ ఇంట్లో మంచమెక్కి నిద్రపోయింది
పులి జనారణ్యంలోకి వచ్చేసింది. ఎంతగా అలసిపోయిందో ఏమో ఓ ఇంట్లోకి దూరి మంచమెక్కి మరీ అదమరచి హాయిగా నిద్రలోకి జారిపోయింది. ఈ ఘటన గురువారం ఉదయం 7.30 సమయంలో అసోం లోని నాగోన్ జిల్లా బగొరీలో జరిగింది. అసోం తో పాటు ఈశాన్య భారతంలో ఇటీవల ఎడతెగని వర్షాలకు వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక్కడకు సమీపంలో 2 కిలో మీటర్ల దూరంలోనే కజిరంగ జాతీయ అభయారణ్యం ఉంది. వర్షాలతో పోటెత్తిన వరదలకు వన్య ప్రాణులన్నీ చెల్లాచెదురైపోయాయి. వీటిలో చాలా జంతువులు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అలా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న రాయల్ బెంగాల్ టైగ్రస్(ఆడ పులి) అనుకోని అతిథిలా ఇలా ఓ ఇంట్లోకి వచ్చి సేద తీరింది. రాయల్ బెంగాల్ పులులు ఈతలో నేర్పరులన్న సంగతి తెలిసిందే. ఇవి కిలోమీటర్ల కొద్దీ అలసిపోకుండా చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంటాయి. ప్రపంచంలో అతి పెద్దవైన సుందర్బన్ (మాంగ్రూవ్స్) మడ అడవుల్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అటు పశ్చిమబెంగాల్, ఇటు బంగ్లాదేశ్ లో విస్తరించిన సుందర్ బన్ మడ అడవుల్లో  ఎక్కువగా గల రాయల్ బెంగాల్ పులులు రాత్రి వేళల్లో ఆహారం కోసం నదుల గుండా ఈదుతూ వేట కొనసాగిస్తుంటాయి. కానీ అసోం లోని బగోరిలో గల మోతీలాల్ ఇంటికి ఆహ్వానం లేని అతిథిలా జొరబడి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. మోతీలాల్ ఇల్లు, షాప్ పక్కపక్కనే ఉంటాయి. ఆ ప్రాంగణంలోకి ఉదయాన్నే పులి దర్జాగా నడుచుకు వస్తుంటే చుట్టుపక్కల జనం కేకలు వేశారు. అప్పటికి పులి..మోతీలాల్ కు కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. బిక్కచచ్చిపోయిన మోతీలాల్ ను ఆ పులి ఏమీ చేయకుండా నేరుగా ఇంట్లోకి దూరి ఓ గదిలో గల మంచంపైకెక్కి నిద్రపోయింది. దాదాపు 10 గంటలు మోతీలాల్ ఇంట్లోనే పులి తనవితీరా సేద తీరింది. మోతీలాల్ కుటుంబ సభ్యుల్ని భద్రంగా ఆ ఇంటి నుంచి వేరో ఇంటికి తరలించారు. అప్పటి వరకు ఆ పులికి నిద్రా భంగం కల్గించకుండా వన్యప్రాణి సంరక్షణ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ ను సైతం క్రమబద్ధీకరించారు. అదే విధంగా జనానికి ఎటువంటి హాని జరగకుండా చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 సమయంలో నిద్ర లేచిన పులి హైవే గుండా సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నామని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యు.టి.ఐ) అధికారి రతిన్ బ్రహ్మన్ తెలిపారు.