Wednesday, November 25, 2020

Diego Maradona dies, aged 60, after heart attack

సాకర్ మాంత్రికుడు మారడోనా కన్నుమూత

సాకర్ ప్రపంచంలో మాంత్రికుడిగా పేరొందిన అర్జెంటీనా అలనాటి మేటి ఆటగాడు డిగో మారడోనా ఆకస్మికంగా మృత్యు ఒడి చేరారు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారన్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఫుట్‌బాల్ లెజెండ్ టైగ్రేలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల మారడోనా తుదిశ్వాస విడిచే వరకు ఆయన శ్వాసధ్యాస సాకరే. అనారోగ్యం కలవరపెడుతున్నా ఫుట్ బాల్ క్రీడకు ఆయన దూరం కాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ అక్టోబర్ 30 న మారడోనా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పటికీ వివిధ సాకర్ క్లబ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లా ప్లాటాలో పట్రోనాటోను 3-0తో ఓడించిన గిమ్నాసియా జట్టుతో విజయానందంలో పాలుపంచుకున్నాడు. మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి మారడోనా ను డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రాణాంతక గుండె పోటు ఆయనను బలితీసుకుంది. తన 21 సంవత్సరాల కెరీర్లో కనబర్చిన అద్భుత ఆటతీరుతో మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో" ("ది గోల్డెన్ బాయ్") అనే మారుపేరు స్థిరపడింది. అర్జెంటీనాకు 1986 లో ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన ఘనాపాఠి మారడోనా. 20 వ ఫిఫా ప్లేయర్‌గా పీలేతో పాటు, మారడోనా గౌరవం పొందాడు.  2010 ప్రపంచ కప్ సందర్భంగా అర్జెంటీనాకు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు.