Thursday, July 18, 2019

Imran Khan plans rally like modi`s style infront of president trumph in US tour


మోదీ ర్యాలీ తరహాలో ట్రంప్ ను ఆకట్టుకోవాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్

అగ్ర రాజ్యం అమెరికాను ప్రసన్నం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పాక్ తో అమెరికా సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ట్రంప్ హయాంలోనూ ఇరు దేశాల మధ్య  సంబంధాలు మెరుగుపడలేదు. ఉగ్రవాద మూలాల పాకిస్థాన్ లో అంతకంతకూ వేళ్లూనుకున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా దూరం పెట్టింది. దాంతో ముంబయి   బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయిీద్ (జె.యు.డి. చీఫ్)ను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ తమ సరిహద్దుల గగన తలంలో భారత్ విమానాల రాకపోకలకు ఆంక్షల్ని తొలగిస్తూ భారత్ తో పాటు అమెరికాను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అమెరికా, పాక్ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఇమ్రాన్ నడుం బిగించారు. అందులో భాగంగానే నెల 22న ఆయన  అమెరికాలో పర్యటించనున్నారు. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ట్రంప్ దృష్టిలో పడాలని ఇమ్రాన్ ఉబలాటపడుతున్నారు. మోదీ ర్యాలీ తరహాలో ఈ ర్యాలీ ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ నాయకుల ర్యాలీలు అమెరికాలో గతంలో అనేకసార్లు నిర్వహించారు. కానీ పాక్ నాయకుడి ర్యాలీ ఏర్పాటు కాబోవడం ఇదే ప్రథమం. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ రాజధాని వాషింగ్టన్ డీసీలోని చైనాటౌన్ లో నిర్వహించతలపెట్టిన ఈ ర్యాలీ సందర్భంగా ఆయన అనుకూల వ్యతిరేక వర్గాల ప్రదర్శనలు జోరందుకోనున్నాయి.  అమెరికాలో పాకిస్థాన్ కు చెందిన పౌరులు దాదాపు అయిదు లక్షల మంది ఉంటారని అంచనా.  తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి వ్యతిరేకంగా ముజాహిర్లు, బలోచిస్థానీయులు, భుట్టో-జర్దారీ లకు చెందిన పీపీపీ అనుకూలురు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిమానులు ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జులై 23న యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్ (యూఎస్ఐపీ) ఆహ్వానంపై ఆ సంస్థ నిర్వహిస్తున్నమేధోమథనం కార్యక్రమంలో ఇమ్రాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తవచ్చని భావిస్తున్నారు.