Thursday, June 20, 2019

raising issue of rahul`s use of mobile during president address frivolous:congress



రాహుల్ పార్లమెంట్ లో ఫోన్ చూసుకుంటున్నారంటూ..
బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తోంది:కాంగ్రెస్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో బిజీ అయిపోయారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు పనికిమాలినవిగా పేర్కొంది. గురువారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా రాహుల్ 20 నిమిషాల సేపు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో మాట్లాడారని అరగంటకు పైగా ఫోన్ చూసుకుంటూ గడపారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో రాహుల్ తన ఫోన్ ద్వారా ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమైపోయారన్నారు. పలు విషయాలపై గంభీరంగా రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కనీసం ఆ అంశాలపై రాహుల్ దృష్టి పెట్టలేదన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై దృష్టి పెట్టిన రాహుల్ వాటిపైనే తమ నాయకురాలు సోనియాతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మృత్యర్థం మౌనం పాటిస్తున్న సందర్భంలోనూ రాహుల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమయ్యారంటూ బీజేపీ సభ్యుడు పరేశ్ రావల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ లో షేర్ చేసిన వీడియో, ఫొటోలు నకిలీ వంటూ నెటిజెన్లు రావల్ పై మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ ఫోన్ చేసుకుంటున్నట్లున్న దృశ్యంతో పాటు మరో పక్క ప్రధాని మోదీ గౌరవ వందనం చేస్తున్న ఫొటోను జత చేసి రావల్ ఫేస్ బుక్ పోస్టులో ఫొటో పెట్టారు. ఈ ఫొటోను చూస్తేనే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి నాయకత్వంలో ఎంత తేడా ఉందో సుస్పష్టమౌతోందని కామెంట్ రాశారు. అయితే రాహుల్ ఫోన్ చూసుకుంటున్నట్లున్న ఫొటో నకిలీదిగా తేల్చిన కొందరు నెటిజన్లు `ఇది బుద్ధిమాలిన పని..నకిలీ వార్తాహరుడు పరేశ్ రావల్ మన ఎంపీ కావడం సిగ్గు చేటు` అని పేర్కొన్నారు.