ఓఎన్జీసీ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం:నలుగురి
దుర్మరణం
నవీ ముంబయిలోని ఓఎన్జీసీ చమురు, సహజవాయువు శుద్ధి కర్మాగారంలో మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో
నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా కాలిన గాయాలపాలయ్యారు. చనిపోయిన
వారిలో ముగ్గురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సి.ఐ.ఎస్.ఎఫ్) సిబ్బంది
కాగా ప్లాంట్ కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన
ముగ్గురు కూడా సి.ఐ.ఎస్.ఎఫ్.కు చెందిన వారేనన్నారు. నవీ ముంబయికి 50 కి.మీ. దూరాన
గల ఉరాన్ లోని ప్లాంట్ లో అగ్నిప్రమాదం ఉదయం 6.47కు జరిగినట్లు సమాచారం. ఓ యూనిట్
పైప్ లైన్ లో గ్యాస్
లీకై రాజుకున్న నిప్పుతో రెండుగంటల్లోనే మొత్తం ప్లాంట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.
భారీ అగ్ని కీలలు చెలరేగడంతో పాటు ఉరాన్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు
కమ్ముకున్నాయి. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు వెళ్లిన సిబ్బంది మృత్యువాత
పడినట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్(వెస్ట్ జోన్) నీలిమా సింగ్
తెలిపారు. అయితే స్థానికులు భయపడనక్కర్లేదని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ప్రభావం
తమ ఉత్పత్తి, సరఫరా కార్యకలాపాలపై పడబోదని ఓఎన్జీసీ
రెసిడెంట్ ప్రోడక్షన్ సూపరింటెండెంట్ సీఎన్ రావు తెలిపారు. గ్యాస్ ను
సూరత్(గుజరాత్) లోగల తమ హజిరా ప్లాంట్ కు మళ్లిస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీని
అదుపు చేస్తున్నట్లు చెప్పారు. 22 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యాయి.
ఘటన వార్త తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జె.ఎన్.పి.టి), రిలయన్స్ గ్రూప్, తలోజాలోని మహారాష్ర్త
ఇండస్రిా్యల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, నవీ
ముంబయి వాసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.