Wednesday, October 14, 2020

Legendary Kuchipudi Dancer Shobha Naidu Passed away

నాట్య మయూరి శోభానాయుడు ఇకలేరు

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్‌ నుంచి  శోభా నాయుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంట్లో జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. అప్పట్నుంచి ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. అదే క్రమంలో శోభానాయుడుకు కరోనా కూడా సోకింది. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా పాజిటివ్ అని తేలిన దగ్గర నుంచి ఆమె ఆస్పత్రికే పరిమితమయ్యారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు కూచిపూడి నృత్యంతో జగద్విఖ్యాతి సాధించారు. క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 12 ఏళ్లకే కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. వెంపటి నృత్య రూపాలలోని పలు పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించి మెప్పించిన శోభా నాయుడును కేంద్రం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 40 ఏళ్లగా కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శోభా నాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులున్నారు.