Friday, February 7, 2020

Telangana CM KCR Inaugurate JBS-MGBS Metro carridor

జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ కు జెండా ఊపిన కేసీఆర్
హైదరాబాద్ మణిహారంగా అలరారుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు (హెచ్.ఎం.ఆర్.ఎల్) లో భాగమైన జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ లో ఈ సాయంత్రం 4గంటలకు మెట్రో రైలు సర్వీసుకు సీఎం పచ్చ జెండా ఊపారు. 11 కిలోమీటర్ల ఈ రూట్లో ప్రయాణికులు కేవలం 16 నిమిషాల్లోనే గమ్య స్థానం చేరుకుంటారు. ఈ కారిడార్లో జేబీఎస్ (పరేడ్ గ్రౌండ్స్), సికింద్రాబాద్ వెస్ట్, న్యూగాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రోజూ సుమారు లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ కారిడార్ తో కలుపుకొని హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు మార్గం 69 కిలోమీటర్ల కు చేరుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లతో పాటు తాజాగా జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. మొత్తంగా ఈ మూడు కారిడార్లలో 16 లక్షల మంది నిత్యం ప్రయాణిస్తారని హైదరాబాద్ మెట్రో వర్గాలు ఆశిస్తున్నాయి. కోల్ కతా దేశంలో మొట్టమొదట మెట్రో రైలు వ్యవస్థను కల్గిన నగరం. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే దేశంలో ఢిల్లీ (డీఎంఆర్సీ) ఎక్కువ దూరం విస్తరించిన మెట్రోగా రికార్డు నెలకొల్పింది.  2002లో కేవలం ఆరుస్టేషన్లతో షహదర-తీస్ హజారీ (8.5 కిలోమీటర్లు) మార్గం తొలుత అందుబాటులోకి వచ్చింది. 17 ఏళ్లలో మొత్తం 11 లైన్లతో 391 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రో విస్తరించింది. నగరంలో గల 285 స్టేషన్లలో రోజూ సుమారు 35 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కోలకతా మెట్రో రైలు సర్వీసు (కె.ఎం.ఆర్.సి) 1984లోనే ప్రారంభమయింది. ప్రస్తుతం 24 స్టేషన్లతో నౌపరా-కవి సుభాష్ (27.22 కిలోమీటర్ల) మార్గమే అందుబాటులో ఉండగా మరో నాలుగు లైన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 7.5 లక్షల మంది ఇక్కడ మెట్రో రైలు సేవల్ని పొందుతున్నారు.