Friday, August 9, 2019

Hong Kong protesters kick off three-day airport rally


హాంకాంగ్ లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య ఉద్యమం
చైనా ఏలుబడిలోకి వచ్చిన హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం మహోజ్వల రూపం దాల్చింది. శుక్రవారం చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి వేల సంఖ్యలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు చొచ్చుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రహదారులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. దేశంలో (చైనా ఆధీనంలో ఉన్న తమ ప్రాంతం-టెరిటరీ) ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కోరుతూ గత ఏప్రిల్ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మూడ్రోజులు విమానాశ్రయాల ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమకాంక్షను వెలిబుచ్చడం ద్వారా అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు విమానాశ్రయాల ముట్టడికి శ్రీకారం చుట్టారు. నిరసనకారులు ముఖ్యంగా యువత ఉద్యమాన్ని ముందుకు నడుపుతోంది. నల్లని దుస్తులు ధరించిన ఆందోళనకారులు ప్లకార్డులు, బేనర్లు చేతపట్టుకుని రహదారుల మీదుగా నినాదాలు చేసుకుంటూ చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి చొచ్చుకువచ్చారు. ఏప్రిల్ లో తొలిసారి ఈ విమానాశ్రయాన్ని ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఇదేవిధంగా ముట్టడించారు. సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకుంటూ ఉద్యమకారులు వందలు, వేల సంఖ్యలో విమానాశ్రయం ముట్టడి దిశగా ముందుకు కదిలారు. హాంకాంగ్ 1997లో బ్రిటన్ నుంచి చైనా ఏలుబడిలో వచ్చిన సంగతి తెలిసిందే. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమాన్ని శాంతింపజేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. నిరసనకారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం దిగరావడం ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయ సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమౌతుందన్నారు. వాస్తవానికి ఏప్రిల్ లో ప్రతిపక్షాల ద్వారా ఈ ప్రజాస్వామ్య ఉద్యమం సెగ రేగింది. అనంతరం విద్యార్థులు, యువత చెంతకు చేరిన ఉద్యమం ప్రస్తుతం ఊపందుకుంది. 428 చదరపు మైళ్ల విస్తీర్ణం కల్గిన హాంకాంగ్ జనాభా సుమారు 74 లక్షలు. ద్రవ్య వినిమయంలో హాంకాంగ్ డాలర్ ప్రపంచంలోనే 13 స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ ప్రజల భాష కంటోనీస్ కాగా ప్రస్తుతం అధికార భాషలుగా మాండరీన్ (చైనీస్), ఇంగ్లిష్ చలామణి అవుతున్నాయి. బ్రిటన్ హయాంలో హాంకాంగ్ వలస ప్రాంతానికి `సిటీ ఆఫ్ విక్టోరియా` నగరం రాజధానిగా ఉండేది. ప్రసుత్తం హాంకాంగ్ టెరిటరీ రాజధాని బీజింగ్. తమర్ లో గల చట్ట సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) లో ప్రతినిధులు సమావేశమవుతుంటారు. బిల్లుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు రూపొందిస్తారు. ప్రాంతీయంగా చట్టాలు చేసే అధికారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే ఉంటుంది. హాంకాంగ్ లో 2016లో జరిగిన ఎన్నికల్లో 22 పార్టీలకు చెందిన సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. బీజింగ్ అనుకూల పార్టీల కూటమి, ప్రజాస్వామ్య ఉద్యమ పార్టీల కూటమి, స్థానిక ప్రయోజనాల పరిరక్షణ పార్టీల కూటమిగా ఈ 22 పార్టీల నుంచి మూడు గ్రూపులు ఏర్పడ్డాయి.