Tuesday, April 30, 2019

wild elephant walks along guwahati city stalls traffic


గువాహటిలో చొరబడిన అడవి ఏనుగు స్తంభించిన ట్రాఫిక్

గువాహటి నగరంలోకి మంగళవారం (ఏప్రిల్ 30) అడవి ఏనుగు చొచ్చుకువచ్చి అలజడి సృష్టించింది. ఇక్కడకు కేవలం 9 కిలోమీటర్ల సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. అందులో నుంచి స్థానిక జి.ఎస్.రోడ్డులోకి ఏనుగు ప్రవేశించింది. సమీపంలోనే రాష్ట్ర సచివాలయం, ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. దాంతో మంగళవారం సాయంత్రం ఏనుగు నగరంలోకి చొరబడే సమయానికి పెద్ద సంఖ్యలో జనం రోడ్లపై ఉండడంతో కలకలం రేగింది. గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కల్గింది. రోడ్డుపై ఏనుగు తిరుగుతుంటే పలువురు సెల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఏనుగు అమ్చాంగ్ ప్రాంతం నుంచి సుమారు 25 కిలోమీటర్లు నడచుకుంటూ గువాహటి లోకి వచ్చినట్లు భావిస్తున్నారు.  ఆహారం లేదా నీటి కోసమే ఏనుగు ఇలా నగరంలోకి వచ్చి ఉంటుందని తెలుస్తోంది. వెంటనే జూ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగును మళ్లీ అడవిలోకి పంపడానికి చేసిన ప్రయత్నాలు రాత్రి వరకు ఫలించలేదు. ఏనుగు సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో తిష్ఠ వేసింది. అటవీశాఖ మంత్రి పరిమల్ సుక్లాబైధ్య మాట్లాడుతూ ఏనుగును అడవిలోకి తిరిగి పంపడానికి ఈ రాత్రి చర్యలు చేపడతామని చెప్పారు. ఏనుగు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చనే ట్రాంక్విలైజర్ ద్వారా మత్తు ఇచ్చే ఆలోచనను విరమించుకున్నామన్నారు.

rahul gandhi expresses regret again in sc over remarks on rafale verdict



‘చౌకీదార్ చోర్ హై’ అంశంపై మరోసారి విచారం వ్యక్తం చేసిన రాహుల్
చౌకీదార్ చోర్ హై అంశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వీడ్డం లేదు. సుప్రీంకోర్టులో ఆయన తాజా అఫిడవిట్ దాఖలు చేస్తూ ఎన్నికల ప్రచార వేడిలో రాఫెల్ ఒప్పందంపై స్పందిస్తూ కావలి వాడే దొంగ(చౌకీదార్ చోర్ హై) అని చేసిన వ్యాఖ్యలపై మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గతంలో రాహుల్ సుప్రీంకు ఈ విషయమై సమాధానమిస్తూ ప్రచార పర్వంలో యథాలాపంగా చౌకీదార్ చోర్ హై అనే మాటలు వాడినట్లు తెలిపారు. ఆ మాటలు తప్పుడు అన్వయానికి దారితీయడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు అఫిడవిట్ లో స్పష్టం చేశారు. అయితే రాహుల్ ‘విచారం’ వ్యక్తం చేస్తున్నట్లు చాలా సింపుల్ గా తప్పించుకోజూడ్డం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని మీనాక్షి మరోసారి సుప్రీం దృష్టికి తెచ్చారు. దాంతో రాహుల్ తాజా అఫిడవిట్ ఇస్తూ ‘విచారం వ్యక్తం చేస్తున్నా’ అనే మాటల్నే పునరుద్ఘాటించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో దేశ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ తప్పుబడుతూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చౌకీదార్ గా తనను తాను చెప్పుకునే మోదీని ఉద్దేశిస్తూ అనేక వేదికలపై నుంచి చౌకీదార్ చోర్ హై అని రాహుల్ ఎదురుదాడి ప్రారంభించారు. రాఫెల్ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది రాహుల్ ఆరోపణల సారాంశం. అయితే ఈ అంశం సుప్రీం కోర్టు చెంతకు చేరడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. రాహుల్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో తమ రాజకీయ ప్రత్యర్థులే చౌకీదార్ చోర్ హై మాటలకు తప్పుడు అన్వయాన్నిచ్చి తనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో తను కోర్టు ధిక్కరణకు పాల్పడిందే లేదని రాహుల్ స్పష్టం చేశారు.