కాంగ్రెస్ మహానేత అజాతశత్రువు కొణిజేటి రోశయ్య (88) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో శనివారం ఉదయం 8 గంటలకు అస్వస్థత గురైన కొద్దిసేపటికే మరణించారు. నాడి పడిపోతుండడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన స్టార్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఇటీవల బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ లోనే ఆయన కొంతకాలం చికిత్స పొందారు. వైద్యులు రోశయ్య మరణించినట్లు ధ్రువీకరించిన అనంతరం పార్థివదేహాన్ని అమీర్ పేట, ధరంకరం రోడ్డులోని స్వగృహానికి తీసుకువచ్చారు. గాంధీభవన్ లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన భౌతికకాయన్ని పార్టీ శ్రేణులు సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్, సన్నిహిత సహచరులు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.