Saturday, September 7, 2019

Those who try, never give up: isro chairman Sivan


విజయం దిశగా ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతాయి: చైర్మన్ శివన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగాలు యథావిధిగా కొనసాగుతాయని చైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు. `విక్రమ్` ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో మూగబోయిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు  ట్వీట్ చేశారు. ఈ ప్రయోగ ఫలితం వెల్లడయిన అనంతరం యావత్ భారత జాతి ఇస్రోకు బాసటగా నిలిచి ప్రోత్సహించింది. బాధను దిగమింగుకున్న చైర్మన్ శివన్ వరుస ట్వీట్లతో ఇస్రో సహచరుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. `విజయం అంతిమమైనది కాదు, అపజయం ప్రాణాంతకం కాదు: ప్రయత్నం అనేది ఆ గణనల్ని కొనసాగించే ఓ ధైర్యం` (Success is not final, failure is not fatal: it is the courage to continue that counts) అన్న బ్రిటన్ మాజీ ప్రధాని సర్ విన్ స్టన్ చర్చిల్ ప్రఖ్యాత సూక్తిని ఉటంకిస్తూ శివన్ ట్వీట్ చేశారు. అదే విధంగా ఇస్రో తదుపరి ప్రయోగాలు ఆదిత్య ఎల్-1, గగన్ యాన్, మంగల్యాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాలు వరుసగా చేపట్టనున్నామని ప్రయత్నాన్ని విడిచిపెట్టబోమని తెలిపారు. ఇస్రో జులై 22న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. అయితే చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్ శుక్రవారం మధ్యరాత్రి చంద్ర గ్రహ దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగాల్సి ఉన్న క్రమంలో స్తబ్ధుగా మారిపోయింది. సంక్లిష్టమైన దక్షిణ ధ్రువప్రాంతంలో మరో 2.1 కిలోమీటర్ల దూరాన్న సురక్షితంగా దిగాల్సిన దశలో `విక్రమ్` నుంచి మిషన్ కంట్రోల్ రూంకు సందేశాలు ఆగిపోయాయి. క్రాష్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.