Showing posts with label andrew russells again like a cyclone. Show all posts
Showing posts with label andrew russells again like a cyclone. Show all posts

Friday, April 19, 2019

storming knock by russells again even though rcb won the match


రస్సెల్ తుపాను.. ఒడ్డునపడ్డ బెంగళూరు
·    కెప్టెన్ కోహ్లీ సెంచరీ, మొయిన్ అర్ధ సెంచరీలతో కోల్ కతాపై గెలుపు
ఐపీఎల్ సీజన్-12 రియల్ హీరో తనేనని ఆండ్రూ రస్సెల్ మరోసారి నిరూపించుకున్నాడు. కోలకతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్.)కు ఘోరమైన ఓటమి తప్పదనుకున్న దశలో ఫీల్డ్ లోకి వచ్చిన రస్సెల్ మళ్లీ విధ్వంసమే సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 25 బంతుల్లో 9 సిక్సర్లు, 2 బౌండరీలతో 65 పరుగులతో దాదాపు జట్టును గెలిపించనంత పని చేశాడు. బాధ్యతగా ఆడిన నితీష్ రాణా 46 బంతుల్లో 5 సిక్సర్లు, 9 ఫోర్లతో 85 అతి విలువైన పరుగులు చేశాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ సెకండ్ డౌన్ లో రాబిన్ బదులు రస్సెల్ ను పంపి ఉంటే కచ్చితంగా కోలకతా గెలిచేది. రస్సెల్, రాణాలు పరుగుల వరద పారించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. కోలకతా అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులే చేయగల్గింది. కేవలం 10 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సీబీ 213/ 4 పరుగులు చేసింది. కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో కోహ్లీకిది అయిదో సెంచరీ. మొయిన్ అలీ కూడా అద్భుతంగా ఆడి 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. కేకేఆర్ టీంలో స్టార్ స్పిన్నర్ కులదీప్ ఓవర్ లో అలీ ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ పరుగుల వేటలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. రస్సెల్ వచ్చే వరకు ఆ జట్టు స్కోర్ బోర్డులో ఒక్క సిక్సర్ కూడా లేదు. రస్సెల్ క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి సిక్సర్ల మోతే. అతని స్ఫూర్తితో రాణా కూడా నేనూ కొట్టగలను అన్నట్లుగా వరుస సిక్సర్ల తో విరుచుకుపడ్డాడు. అయితే రస్సెల్ బ్యాటింగ్ దూకుడుకు 60 వేల మంది ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. ప్రేక్షకుల గ్యాలరీ లో కూడా రస్సెల్ కోసం మరో 10 మంది ఫీల్డర్లను మోహరించిలన్నంతగా అతని బ్యాటింగ్ సాగింది.