Monday, October 28, 2019

Unemployment fuels unrest in Arab states: IMF


గల్ఫ్ దేశాల్లో అశాంతిని రగిలిస్తోన్న నిరుద్యోగిత:ఐఎంఎఫ్
గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగా అశాంతి నెలకొంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. సోమవారం ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్ని కల్గి ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సెప్టెంబర్ వరకు పరిణామ క్రమాల్ని అనుసరించి ఈ మేరకు ఐఎంఎఫ్ నివేదిక రూపొందించింది. ఈ దేశాల్లో అభివృద్ధి సూచి తక్కువగా ఉండడానికి కారణం నిరుద్యోగితేనని ఐఎంఎఫ్ మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏసియా డైరెక్టర్ జిహద్ అజర్ తెలిపారు. అభివృద్ధి సూచీలో పెంపుదల నమోదు కావడానికి ఈ దేశాలు తొలుత నిరుద్యోగిత నివారణ చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. ఇక్కడ యువత నిరుద్యోగిత శాతం 25 నుంచి 30 వరకు ఉన్నట్లు చెప్పారు. ఈ అవరోధాన్ని అధిగమిస్తే అభివృద్ధిలో 1-2 శాతం పెంపు సాధ్యమౌతుందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగానే అశాంతి, అలజడి వాతావరణాలు నెలకొంటున్నాయని ఐఎంఎఫ్ విశదీకరించింది. ఇక్కడ నిరుద్యోగిత 11 శాతం ఉందని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, యువత ఉద్యోగాలకు దూరమయ్యారంది. 2018 నాటికి 18 శాతం మంది మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, యెమన్, లిబియాల్లో అంతర్యుద్ధాలూ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినట్లు ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అదేవిధంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే ప్రజలపై రుణభారం 85 శాతానికి మించినట్లు తెలిపింది. లెబనాన్, సూడాన్ ల్లో అయితే రుణభార శాతం 150కి పైగా ఉన్నట్లు పేర్కొంది. ఇస్లామిక్ దేశాల్లో గతంలో జీడీపీ 9.5గా నమోదు కాగా 2018 నాటికి -4.8గా తిరోగమనం బాట పట్టినట్లు ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థికమాంద్యం, చమురు ధరల అస్థిరత, రాజకీయ పరిస్థితులు కూడా తాజా దుస్థితికి కారణాలుగా ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది.