Wednesday, May 22, 2019

lok sabha polls 2019: highest ever voter turnout: election commission



లోక్ సభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తోన్న ఓట్ల శాతం
గడిచిన ఒకటిన్నర దశాబ్దంగా జరుగుతున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓట్ల శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇటీవల 17వ లోక్ సభ ఎన్నికల క్రతువు ఆరు వారాలు నిర్విఘ్నంగా కొనసాగి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఏప్రిల్ 11న మొదలైన ఎన్నికల పోలింగ్ 7 దశల్లో మే 19న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 543 నియోజకవర్గాలకు గాను 542 స్థానాలకు(545 మంది మొత్తం సభ్యుల్లో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు) పోలింగ్ నిర్వహించారు. విచ్చలవిడిగా డబ్బుల కట్టలను కనుగొన్న తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గంలో  ఈసీ ఎన్నికను వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 7దశల్లో సాగిన పోలింగ్ లో మొత్తం ఓటింగ్ 67.11 శాతంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) పేర్కొంది. తొలిదశలో అత్యధికంగా 69.61 శాతం నమోదయింది. అన్ని రాష్ట్రాల్లో కన్నా హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి అత్యధికంగా 72.25 శాతం ఓటింగ్ నమోదై రికార్డు నెలకొల్పింది. 2014 ఎన్నికల్లో 66.40 శాతం కన్నా ఈసారి కొంత మెరుగ్గా ఓటింగ్ జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మొత్తం 58.19 శాతమే ఓటింగ్ నమోదయింది. 2004లో 56 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.