కరోనా నుంచి తప్పించుకున్న హైదరాబాద్ వాసి
హైదరాబాద్
మహేంద్ర హిల్స్ కు చెందిన టెకీ సురక్షితంగా కోవిడ్-19 (కరోనా వైరస్) బారి నుంచి బయటపడ్డాడు.
శుక్రవారం `గాంధీ ఆసుపత్రి` సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
బెంగళూరులో పనిచేస్తున్న టెకీ గత నెలలో దుబాయ్ కి వెళ్లి తిరిగివస్తూ కరోనాకు చిక్కాడు.
ఈనెల 1న బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న టెకీకి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్
గా తేలింది. అప్పటి నుంచి `గాంధీ` వైద్యులు కంటికి రెప్పలా అతణ్ని కాపాడారు. మెరుగైన
చికిత్స అందిస్తూ ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈనెల 9న మళ్లీ అతనికి పరీక్షలు నిర్వహించగా
ఆ రిపోర్టు ఈరోజు అందింది. అందులో అతనికి కరోనా నెగిటివ్ అని రావడంతో వైద్యులు సహా
నగర వాసులు ఊపిరిపీల్చుకున్నారు. టెకీని ఇంటికి తరలించారు. అయితే కొంతకాలం అతను జనజీవన
స్రవంతిలోకి రాకపోవడమే మంచిదని శ్రవణ్ కుమార్ కోరారు. ఒకసారి కరోనా సోకి చికిత్స పొందిన
తర్వాత మళ్లీ ఆ వ్యాధి సంక్రమించే ప్రమాదం తక్కువన్నారు. అయినా కొంతకాలం ఇంట్లో సైతం
అతను విడిగా ఉండడం మంచిదని చెప్పారు. ఎబోలా, నిఫా, స్వైన్ ఫ్లూ తదితర వైరస్ లు ప్రబలినప్పుడూ
`గాంధీ` వైద్యులు ధైర్యంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సంగతిని గుర్తు
చేస్తూ శ్రవణ్ కుమార్ తాజాగా కరోనా విషయంలోనూ అదే స్ఫూర్తితో సమర్ధంగా పని చేస్తున్నారని
ప్రశంసించారు. దాంతో హైదరాబాద్ లో ఏకైక కరోనా పీడితుణ్ని `గాంధీ` వైద్యులు కాపాడినట్లయింది.