Tuesday, July 2, 2019

As DMK backtracks congress mulling to send manmohan singh to Rajya Sabha from Rajasthan


రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్:కాంగ్రెస్ యత్నం
మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన డా.మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపనున్నారు. ఎగువసభలో ఆయన ఇంతవరకు అసోం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గత నెలలో రాజ్యసభలో ఆయన పదవీ కాలం పూర్తి అయింది. అసోం నుంచి ఆయనను తిరిగి ఎంపిక చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు తగిన సంఖ్యా బలం లేదు. మిత్రపక్షం డీఎంకె చెయ్యిచ్చిన దరిమిలా కాంగ్రెస్ రాజస్థాన్ నుంచి ఆయనను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. రాజ్యసభలో రాజస్థాన్ నుంచి ఏకైక స్థానం ఖాళీ అయింది. బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ గత నెల24 మరణించడంతో రాజ్యసభ కు ఆ రాష్ట్రం నుంచి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన సాగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకె, కాంగ్రెస్ కూటమి లోక్ సభ కు గణనీయంగా అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగాయి. కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని డీఎంకె ద్వారా ఆశించింది. అయితే తమ కూటమిలోని ఎండీఎంకె అధినేత వి.గోపాలస్వామి (వైగో) కి ఆ స్థానాన్ని ఇవ్వనున్నట్లు తాజాగా డీఎంకె మెలికపెట్టింది. దాంతో మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా మన్మోహన్ రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడితే 2024 వరకు సభ్యుడిగా కొనసాగుతారు.

Rain havoc in india`s financial capital Mumbai, 32 dead


ముంబయి మునక:32 మంది మృతి 75 మందికి గాయాలు
భారత వాణిజ్య రాజధాని ముంబయి వరుసగా రెండో రోజూ వరదల తాకిడికి అల్లాడుతోంది. కుంభవృష్టి కారణంగా మహారాష్ట్ర రాజధాని ముంబయి పరిధిలో 32 మంది మృత్యుపాలయ్యారు. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి పరిసర నగరాలు థానె, పుణె కూడా మునకేశాయి. కొంకణ్ ప్రాంతంలో మంగళవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు, ఆఫీసుల్ని మూసివేశారు. ఎడతెగని వర్షాల కారణంగా రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో(మంగళవారం) పింప్రిపడ ప్రాంతంలో కొండవాలులో నిర్మించిన భవనం ప్రహారీ కూలి 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్), ముంబయి అగ్నిమాపక సిబ్బంది శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. గడిచిన 12 గంటల్లో 300-400 మి.మి. వర్షపాతం నమోదైనట్లు సీఎం దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మలద్ సబ్ వేలో సోమవారం రాత్రి వరద నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాల్ని మంగళవారం కనుగొన్నారు. థానె జిల్లాలోని కల్యాణ్ పట్టణంలో జాతీయ ఉర్దూ పాఠశాల భవనం గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. జవహర్ నదీ ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్లు సమాచారం. ముంపునకు గురైన ఈశాన్య ముంబయి కుర్లా లోని క్రాంతినగర్ మురికివాడలో నేవీ బృందం లైఫ్ జాకెట్లు, రబ్బర్ బోట్లతో రక్షణ చర్యలు చేపట్టింది. ముంబయి పరిధిలోని రాయ్ గఢ్, థానె, పాల్ఘర్ జిల్లాల్లో నడుం లోతు వరద ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమయింది. దాదాపు 150 బ్రిహన్ ముంబయి రవాణా(విద్యుత్) బస్సులు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ మధ్యాహ్నం ఎడతెగని వాన తెరపి ఇవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని తెలియడంతో జనం భీతిల్లుతున్నారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గడంతో ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ విమానాశ్రయానికి రావాల్సిన 55 విమానాల్ని దారి మళ్లించారు. ఇందులో 26 అంతర్జాతీయ విమానాలున్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన 4 అంతర్జాతీయ విమానాలు సహా మొత్తం 18 విమానాల్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అంధేరి, జోగేశ్వరి, విలేపార్లే, దహిసర్ ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగి ఉండడంతో రోడ్డు మార్గం లో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముంబయి-థానె మార్గంలో ట్రాక్ లన్నీ నీట మునగడంతో సెంట్రల్ రైల్వే పలు రైళ్లను దారి మళ్లించింది. పశ్చిమ రైల్వే జోన్ కు చెందిన రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి థానె మార్గంలో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. జులై 3,4 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి.