Friday, August 30, 2019

India pays in advance for S-400 missiles to Russia


2023లో భారత సైన్యం చేతికి రష్యా ఎస్-400 క్షిపణులు
రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎస్-400 గగనతల రక్షణ క్షిపణులు 2023లో భారత సైన్యం చేతికి అందనున్నాయి. ఈ మేరకు రష్యాకు భారత్ ముందస్తు మొత్తాన్ని (బయానా) చెల్లించింది. భూఉపరితలం నుంచి గగనతలంలో శత్రుదుర్భేద్య మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థ (ఎస్-400) నిర్ణీత గడువులో భారత సైన్యం అమ్ములపొదిలో చేరనుంది. ఇందుకు సంబంధించి భారత్ తో అన్ని అంశాలు పరిష్కృతమై ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రష్యా ఫెడరల్ సర్వీసెస్ మిలటరీ అండ్ టెక్నికల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తను భారత్ లోని రష్యా రాయబార వ్యవహారాల మంత్రి రోమన్ బబుష్కిన్ ధ్రువీకరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రానున్న నాల్గేళ్లలో ఈ  ఎస్-400  క్షిపణి రక్షణ వ్యవస్థ (మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్/ యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్) భారత్ కు అందనున్నట్లు తెలిపారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చడంలో భాగంగా ఒప్పందం ప్రకారం ఈ క్షిపణుల్ని సకాలంలో అందజేయనున్నామన్నారు. రష్యా తయారీ ఎస్-400 క్షిపణికి 600 కి.మీ దూరంలోని లక్ష్యాలను తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. రెండంచెల రక్షణ వ్యవస్థ కల్గిన ఈ క్షిపణులు 1990లో రూపుదిద్దుకుని అనేక పరీక్షల అనంతరం 2007లో రష్యా సైన్యం చెంతకు చేరాయి. ప్రపంచంలో ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థే ప్రస్తుతానికి అత్యంత ఆధునికమైంది. నాటో (ఉత్తర అమెరికా, యూరప్) దేశాల్లో ఈ క్షిపణుల్ని ఎస్.ఎ-21 గ్రోవ్లర్ గా పిలుస్తారు.