Friday, June 14, 2019

Bowlers and Root help England rout West Indies in world cup



వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ ఘన విజయం
వర్షాలతో నిస్తేజంగా మారిన వరల్డ్ కప్ క్రికెట్ సంబరంలో ఇంగ్లాండ్ ప్రొఫెషనల్ ఆటతీరుతో మళ్లీ జోష్ నింపింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.19 సౌథాంప్టన్ వేదికపై శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన పోరులో ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ షో చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ జోరూట్ ఈ మ్యాచ్ లో సరిగ్గా వంద పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రూట్ కి టోర్నీలో ఇది రెండో సెంచరీ. బౌలింగ్ లోనూ రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వెస్టిండీస్ ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఇంగ్లాండ్ ఛేదించింది. ఇంగ్లాండ్ కేవలం 33.1 ఓవర్లలోనే జానీ బెయిర్ స్టో(45), క్రిస్ వోక్స్ (40) వికెట్లను కోల్పోయి 213 పరుగులు చేసింది. ఆ రెండు వికెట్లను షానాన్ గాబ్రియల్ పడగొట్టాడు. మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు లో సెకండ్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన నికోలస్ పూరన్ మాత్రమే 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షిమ్రన్ హెట్మెయర్ (39), క్రిస్ గేల్ (36) మాత్రమే జట్టులో చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. బ్యాటింగ్ లో 9 పరుగులే చేసిన కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లోనూ రాణించలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ చెరి 3 వికెట్లు తీసుకోగా రూట్ 2 వికెట్లు, ప్లంకెట్, క్రిస్ వోక్స్ లు చెరో వికెట్ పడగొట్టారు.

one dead another man severe injuries in trees collapse incidents in Mumbai



ముంబయిలో చెట్లు కూలి ఒకరి దుర్మరణం మరొకరికి తీవ్రగాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.  ముంబయిలోని విజయ్ కర్ వాడి సమీపంలోని ఎస్.వి.రోడ్డుపై శుక్రవారం ఉదయం 6.30కు దుర్ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా ఈదురుగాలులు వీస్తుండడం స్వల్ప వర్షం కురవడంతో ఆకస్మికంగా చెట్టు కూలిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న శైలేష్ మోహన్ లాల్ రాథోడ్ (38) పై అమాంతంగా చెట్టు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతణ్ని శత్బది ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఘటనలో జోగేశ్వరి సబర్బన్ ప్రాంతంలోని తక్షశిల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లో చెట్టు కూలిపోగా అనిల్ గోసల్కర్(48) తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే సొసైటీలో భారీ వృక్షాల కొమ్మలను నరికివేయాలని ఏప్రిల్ 24 నే తాము సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎస్.వి.రోడ్డు లో మార్గానికి అడ్డంగా కూలిపోయిన చెట్టును తొలగించే పనులు చేపట్టినట్లు బ్రిహ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) లోని విపత్తు సహాయక విభాగం అధికారులు చెప్పారు.