Friday, January 3, 2020

Farmers in Amaravati protest against AP CM Jagan's idea of 3 capitals to the state

ఏపీలో సకల జనుల సమ్మె ఉద్రిక్తం
ఆంధ్రప్రదేశ్ కు `మూడు రాజధానులు వద్దు ప్రస్తుత రాజధాని అమరావతే ముద్దు` అంటూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. గత 16 రోజులుగా రోడెక్కిన రైతులు శుక్రవారం సకల జనుల సమ్మెకు పిలుపు ఇచ్చారు. దాంతో రాజధాని సమీపంలోని బాధిత 29 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మందడం కు ర్యాలీగా తరలడానికి సిద్ధమైన `జనసేన` అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పోలీసులు దారిలోనే నిలిపివేశారు. దాంతో ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. సకల జనుల సమ్మె పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. రైతులకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ప్రతిపక్ష నాయకులు విరుచుకు పడ్డారు. మహిళల్ని బస్సుల్లో అక్కడ నుంచి పోలీసులు తరలించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ రైతులు ఆ వాహనాలకు అడ్డంగా పడుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకుంటోందని..ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చేందుకు రోడ్డు పైకి వస్తే వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారని ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇది మా సమస్య కాదని మౌనంగా ఉంటే రేపొద్దున మరో బాధ వారిని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు వారికి సహకరించే వారుండరని అందుకే సమష్ఠిగా పోరాడాలని సూచించారు.