Sunday, April 21, 2019

srilanka six blasts hit three churches three five star hotels as 140 killed over 400 injured

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు.. సినీ నటి రాధికకు త్రుటిలో తప్పిన ముప్పు

శ్రీలంక ఆదివారం(ఏప్రిల్21) బాంబు పేలుళ్లతో రక్త సిక్తమైంది. రాజధాని కొలంబో సహా నెగొంబొ, బట్టికలొవా ల్లోని చర్చిలు, స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లకు 140 మందికి పైగా దుర్మరణం చెందారు. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈస్టర్ సండే సందర్భంగా క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం 8.45 సమయంలో బాంబు పేలుళ్లు మొదలయినట్లు పోలీసు అధికారి రువాన్ గుణశేఖర తెలిపారు. మొత్తం ఆరు భారీ బాంబు విస్ఫోటనాలు సంభవించాయి. దాంతో మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు రక్తసిక్తమయ్యాయి. కొలంబోలో 42 మంది, నెగొంబొలో 60 మంది, బట్టికలొవాలో 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు. మృతులు, క్షతగాత్రుల్లో పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఈ పాశవిక బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఏ ఉగ్ర సంస్థ ఇంకా పేర్కొనలేదు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని దర్యాప్తు లో కుట్ర కోణం వెలుగుచూడగలదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జాతుల సమస్యతో దశాబ్దాల పాటు నెత్తురోడిన శ్రీలంకలో ఇటీవల కాలంలో ఇంత పెద్దఎత్తున మారణహోమం జరగడం ఇదే తొలిసారి.
షాక్ కు గురైన నటి రాధిక 
తమిళ సినీ నటి రాధికా త్రుటిలో వరుస బాంబు పేలుళ్ల నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. కొలంబోలోని స్టార్ హోటల్ సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో రాధికా బస చేశారు. ఈ హోటల్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుకు కొద్ది నిమిషాలు ముందే ఆమె బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన పట్ల రాధికా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆ తర్వాత విలేకర్లకు తెలిపారు.

No comments:

Post a Comment