Monday, December 16, 2019

On Dharna Against Jamia Crackdown, Priyanka Gandhi Says 'It's Attack on India's Soul'

ఇండియా గేట్ వద్ద ప్రియాంకగాంధీ `నిశ్శబ్ద నిరసన`

పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ సహా దేశంలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు వ్యక్తం చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ సంఘీభావం తెలిపారు. సోమవారం ఆమె కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులతో కలిసి రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 4కు ఆమె ధర్నాకు కూర్చున్నారు. రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని `నాశనం` చేయడానికే దీన్ని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిందని ఆమె విరుచుకుపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తుంటే వారిపై దాడికి దిగడం `భారత ఆత్మపై దాడి`గా ప్రియాంక పేర్కొన్నారు. ఆదివారం జామియా విద్యార్థులపై పోలీసుల అణిచివేత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియంతగా మారుతున్న మోదీకి వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడతారని ప్రియాంక గాంధీ అన్నారు. ఆర్థికవ్యవస్థ, మహిళలు, విద్యార్థులపై మోదీ సర్కారు వరుసగా దాడికి పాల్పడుతోందని విమర్శించారు. హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రధాని చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ అజాద్ తీవ్రంగా ఖండించారు. జామియాలో పోలీసు ప్రవేశానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై కేసు బుక్ చేయాలని సీపీఐ ప్రధానకార్యదర్శి రాజా కోరారు. ఈ ఘటన బాధ్యులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచురీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, ఆర్జేడీ నేత మనోజ్, ఎస్పీ నాయకుడు జావేద్ అలీఖాన్, జేడీ(యు) సీనియర్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొని విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండించారు.