Monday, September 30, 2019

Close associate of gangster Kapil Sangwan held in Delhi


గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ కీలక అనుచరుడి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ ముఠా లోని కీలక సభ్యుణ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఉదయం ద్వారాక ప్రాంతంలో ఓ కారును అతను బైక్ పై వెంబడిస్తూ అటకాయించే ప్రయత్నం చేశాడు. తుపాకీతో కాల్పులకు తెగబడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో అతని ఎడమకాలులో నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో బైక్ పై నుంచి కింద పడ్డాడు. వెంటనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతణ్ని కపిల్ సంగ్వాన్ ప్రధాన అనుచరుడు కుల్దీప్ రాథిగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు, అపహరణలు, హత్య, హత్యా యత్నాలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భూకబ్జాలు తదితర పలు కేసుల్లో రాథి నిందితుడన్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న కపిల్ సంగ్వాన్ పెరోల్ పై ఈ జూన్ లో విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున పార్టీ చేసుకునేందుకు ముఠా సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కరుడగట్టిన అతడి అనుచరులు 15 మందిని స్పెషల్ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నజఫ్ గఢ్ లోని గొయల డైరీ ప్రాంతంలో వీరంతా సమావేశమైనట్లు ఏఎస్ఐ దినేశ్ కుమార్ కు సమాచారం అందడంతో స్పెషల్ సెల్ ను అప్రమత్తం చేశారు. ఏసీపీ మనోజ్ పంత్ ఆధ్వర్యంలో స్పెషల్ సెల్ పోలీసులు రెండు జట్లుగా విడిపోయి ఈ ముఠాపై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు.  పట్టుబడ్డ వారిలో ఇద్దరు కొత్తవారు కాగా మిగిలిన 13 మంది పలు దారుణాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కినవారే. ఈ గ్యాంగ్ కు చెందిన మరో ఎనిమిది మందిని సైతం 2018 జులైలో వసంత్ కుంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.