Tuesday, March 9, 2021

Andhra Pradesh government allows beneficiaries to get Corona vaccine without registration

ఏపీలో కరోనా టీకా ఈజీగా..

ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఎంచక్కా కరోనా టీకా తీసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు జస్ట్ తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు. అదేవిధంగా ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు టెస్టుల రిపోర్టులు, డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు చూపిస్తే టీకా వేస్తారు. చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. తొలి విడత వైద్య సిబ్బందికి, రెండో విడతలో పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ పై అవగాహన లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే అర్హులకు మంగళవారం నుంచి ప్రభుత్వం చాలా సులభంగా అందిస్తోంది.