Wednesday, April 15, 2020

Karnataka former CM Kumaraswamy to go ahead with his son marriage during covid-19 pandemic

కుమార.. నీకు అర్థమౌతోందా?!
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో విలవిల్లాడిపోతుంటే.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అర్థమౌతోందా? అనే అనుమానం కల్గుతోంది. దేశంలో తాజాగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండగా అనుకున్న ముహూర్తానికే కొడుకు పెళ్లి చేసేయాలని కుమారస్వామి ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. తన కుమారుడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన నిఖిల్ గౌడ, కాంగ్రెస్ నేత ఎం. క్రిష్ణప్ప మనవరాలు (మేనకోడలి కూతురు) రేవతి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాలని తొలుత అనుకున్నారు. రామనగర జిల్లాలో 95 ఎకరాల స్థలంలో వివాహ వేదిక ప్రాంగణాన్ని నిర్మించి అయిదు లక్షల మంది పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులను ఆహ్వానించాలని ఆయన భావించారు. తర్వాత బెంగళూరులో గ్రాండ్ రిసెప్షనూ ఏర్పాటు చేయాలనుకున్నారు. నిశ్చితార్థానికి సీఎం యడ్యూరప్ప సహా పలువురు ప్రముఖులు కుమారస్వామి ఆహ్వానం మేరకు హాజరయ్యారు. కానీ లాక్‌డౌన్-2 అమలులో ఉన్న కారణంగా పెళ్లికి లక్షల మందిని ఆహ్వానించే పరిస్థితి లేదు. అయినా నిఖిల్, రేవతిల పెళ్లి యథాతథంగా ఏప్రిల్ 17న  జరగనుంది. ఆ రోజున మంచి ముహూర్తం ఉండడమే అందుకు కారణం. పైగా ముహూర్తాల పట్ల, దేవుడి మీద అపార నమ్మకం కల్గిన ఆయన ముందు నిర్ణయమైన తేదీలోనే ఎలాగైనా సరే పెళ్లి జరపాలని నిర్ణయించారు.  అయితే తన కొడుకు పెళ్లికి ఎవరూ రావొద్దని జేడీఎస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులను కుమారస్వామి కోరుతున్నారు. కరోనా తగ్గిసాధారణ పరిస్థితులు నెలకొన్నాకే  బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పెళ్లికి 15 నుంచి 20 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని కుమారస్వామి ప్రకటించారు.