Tuesday, June 18, 2019

Earthquakes in china kills 11, injuries over 100



చైనాలో భూకంపం 11 మంది దుర్మరణం
చైనాలో సోమవారం అర్ధరాత్రి రెండు ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడగా మరో 122 మంది తీవ్రగాయాలపాలయ్యారు. చైనా నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్ యుబిన్ కౌంటీలో సోమవారం రాత్రి 11.55 ప్రాంతంలో తొలి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదయింది. భూమి లోపల 16 కి.మీ. లోతున భూకంపకేంద్రాన్ని గుర్తించిన్నట్లు చైనా ఎర్త్ క్వాక్ నెట్ వర్క్స్ సెంటర్ (సీఈఎన్సీ) వర్గాలు తెలిపాయి. రాజధాని చెంగ్డ్యూతో పాటు మరో నగరం చోంగ్వింగ్ భూకంపాల తీవ్రతకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రజలు ఫ్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రెండో భూకంపం 5.2 తీవ్రతతో సంభవించినట్లు చాంగ్వింగ్ కౌంటీలోని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. సిచువాన్ ప్రావిన్స్ లో 2008 నాటి తీవ్ర భూకంపంలో సుమారు 70వేల మంది మృత్యువాత పడ్డారు. ఇళ్లు కూలిపోయిన ఘటనలో జనం ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అత్యవసర సహాయక బృందాలు, సైనిక, పోలీసు సిబ్బంది శిథిలాల తొలగింపు పనుల్ని చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Mamata to skip tomorrow`s all party heads meet in delhi



ప్రధాని సారథ్యంలోని అఖిల పక్ష సమావేశానికి మమతా డుమ్మా!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని అఖిల పక్ష అధినేతల సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానని తేల్చి చెప్పారు. బుధవారం జరుగనున్న ఈ సమావేశానికి ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ముందుగా నిర్ణయమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తను ఈ సమావేశానికి హాజరుకాబోవడం లేదని మమతా మంగళవారం తెలిపారు. జూన్ 15న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం మమతా హాజరుకాని సంగతి తెలిసిందే. `ఒకే దేశం.. ఒకే ఎన్నికలు` అనే అంశంపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్రానికి సూచించారు. ఈ విషయమై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరగాలని కోరారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటూ హడావుడిగా నిర్ణయం తీసుకుని అమలుచేసే అంశం కాదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తగినంత వ్యవధి తీసుకుని అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరిగాకే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందన్నారు. చాలా ముఖ్యమైన విషయమైనందున కూలంకుషంగా ఆలోచించాకే నిర్మాణాత్మక సూచనల్ని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేస్తుందన్నారు. 2022లో జరుగనున్న దేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో, ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో టీఎంసీ హృదయపూర్వకంగా పాల్గొంటుందని మమతా తెలిపారు.


UP govt to now issue press releases in Sanskrit also


సంస్కృత భాషను ప్రోత్సహించే చర్యలు చేపట్టిన యూపీ
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషయిన సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకుంది. ప్రభుత్వ ప్రకటనల్ని హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇకపై సంస్కృతంలో కూడా ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఇప్పటికే ఆరాష్ట్ర సమాచార శాఖ జూన్17 సోమవారం సంస్కృతంలో తొలి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రజలకు అందించే ముఖ్యమైన ప్రభుత్వ సమాచారం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగాలను సంస్కృతంలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్నో లోని రాష్ట్రీయ సాంస్క్రీట్ సంస్థాన్ సీఎం ప్రసంగాల్ని సంస్కృతంలో తర్జుమా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం యోగి ప్రసంగాన్ని సంస్కృతంలోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందుకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన మీదట ఇప్పుడు అదే ఒరవడిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. సంస్కృతం భారతీయుల డీఎన్ఏ..అయితే ఆ భాషను కేవలం పండితులకే పరిమితం చేశామని ముఖ్యమంత్రి యోగి సోమవారం ఓ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. యూపీలో ఇప్పటికే సంస్కృత భాష పునర్జీవానికి కృషి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో 25 పత్రికా సంచికలు (పిరియాడికల్స్) సంస్కృతంలొనే వెలువడుతుండడం విశేషం. ప్రపంచంలోని సుమారు 850 భాషల పుట్టుకకు మాతృక గానో, ప్రేరణ గానో సంస్కృతం నిలవడం దేశం గర్వించదగ్గ పరిణామం. రాజభాషగా శతాబ్దాల పాటు వర్ధిల్లిన సంస్కృతం భారత్ కు ఎనలేని కీర్తిని తెచ్చిందనడంలో సందేహం లేదు.