Wednesday, July 10, 2019

3 die of asphyxiation in Telangana


బావిలో మోటారు రిపేరుకు దిగి ముగ్గురు మృత్యువాత
తెలంగాణ లోని ఓ పురాతన బావిలో మోటారు మరమ్మతు చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ముత్యంపేట మండలానికి చెందిన కౌటలా గ్రామంలో చోటు చేసుకుంది. 35 అడుగుల లోతు గల ఈ బావిలోకి బుధవారం ఉదయం మోటార్ రిపేరు చేయడానికి వీరంతా దిగినట్లు తెలుస్తోంది. తొలుత ఓ వ్యక్తి ఈ బావిలోకి దిగి విషవాయువులు వెలువడిన కారణంగా ఊపిరాడక చనిపోయాడు. అతణ్ని రక్షించడానికి తోటి పనివాళ్లు ఇద్దరు ఒక్కొక్కరుగా అందులోకి దిగి అపస్మారక స్థితిలోకి చేరి ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ముగ్గురు 19 నుంచి 25ఏళ్ల లోపు యువకులు. మృతుల్ని రాజు(26), శ్రీనివాస్(25), మహేశ్(18) గా గుర్తించారు. మృతదేహాల్ని బావిలో నుంచి వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈనెల 8న నల్గొండ జిల్లాలోని షాలిగౌరారం మండలానికి చెందిన పెరికకొండారం గ్రామంలో ఓ 18 ఏళ్ల విద్యార్థిని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. కావ్య అనే ఆ విద్యార్థిని బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. పశువులకు మేత వేయడానికి వెళ్లిన ఆమె నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయింది.