Friday, April 19, 2019

will priyanka go to contest in varanasi constituency against prime minister modi


ప్రియాంక వారణాసిలో ప్రధాని మోదీతో పోటీపడతారా?
2019 సార్వత్రిక ఎన్నికల వేడిలో అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం వారణాసి ఎన్నిక. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారా లేదా అనే అంశమే రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ప్రధాని మోదీ తొలిసారిగా లోక్ సభకు ఇక్కడ నుంచే బరిలో నిలిచి విజయం సాధించారు. నయా ఇందిరమ్మగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రియాంక వారణాసి నుంచి బరిలోకి దిగితే మాత్రం పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం. దిగ్గజం పై మరో దిగ్గజం పోటీ చేస్తున్న నియోజకవర్గం పైనే మొత్తం దేశం కళ్లు కేంద్రీకృతమౌతాయి. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని ప్రియాంక అంటుండగా అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్కంఠకు తెరదించడం లేదు. పైగా సస్పెన్స్ కొనసాగించడం తప్పేమీ కాదంటూ చలోక్తులు విసురుతున్నారు.
నెహ్రూ-గాంధీ వంశాంకురమైన ప్రియాంక ఇటీవలే పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు వరకు ఆమెది కేవలం ప్రచారకర్త పాత్రే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ (యూపీ) కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గాను వ్యవహరిస్తూ ఆమె పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. స్వయంగా ఆమె బరిలోకి దిగితే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మరోవైపు ప్రధాని మోదీ దేశంలో తిరుగులేని నాయకుడు. ఇందిరాగాంధీ తర్వాత అంతటి సమర్ధుడిగా పేరు. ముమ్ముర్తులా ఇందిరనే పోలిన ప్రియాంక పోటీకి దిగితే వీరిద్దరి ముఖాముఖి 2019 ఎన్నికల చిత్రానికి కొత్త రూపును తెస్తుంది. మోదీ, ప్రియాంకలు ఉభయులకూ అవినీతి అంశమే ప్రధాన ప్రచారాస్త్రం. తాజా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఈ అంశంపై రెండుపార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
రాఫెల్ ఒప్పందం గురించి ప్రియాంక ప్రస్తావిస్తే అక్కడ ఎన్నికల ప్రచారం మరింత సెగలు రేపుతుంది. రాబర్ట్ వాద్రా (డీఎల్ ఎఫ్ కేసు) భుజాల మీదుగా తుపాకీ ఎక్కుపెట్టి మరీ మోదీ ఆమెపై ఎదురుదాడికి దిగుతారు. ప్రచార సభల్లో, ఓటర్లను కలిసి మాట్లాడిన సందర్భాల్లో ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వారి శైలే వేరు. వేదికలపై ప్రసంగించినప్పడు, జనంతో మమేకమైనప్పుడూ హుందాతనమే కనిపిస్తుంది. మాట, చేతల్లో సామాన్యుల్లో కలగలిసి పోతుంటారు. ప్రస్తుతం ప్రియాంక ప్రచార పర్వం అదే రీతిలో సాగుతోంది. ఇటీవల అలహాబాద్ నుంచి వారణాసికి గంగా(బోటు)యాత్రలో పర్యటించిన ప్రియాంక తన నాయనమ్మతో ఆనంద్ భవన్ (అలహాబాద్)లో గడిపిన మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుని ఓటర్లలో సెంటిమెంట్ రగిలించారు. ముఖ్యంగా మోదీకి ప్రత్యామ్నాయం తామేనని తెల్పడమే ప్రధాన ఉద్దేశంగా ప్రియాంక పోటీ చేస్తున్నట్లు స్పష్టమౌతోంది.
 1952 నుంచి ఇంతవరకు ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ అత్యధికంగా ఏడుసార్లు విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఆరుసార్లు, సీపీఎం, భారతీయ లోక్ దళ్, జనతాదళ్ ఒక్కోసారి  గెలిచాయి.  2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(2,09,238 ఓట్లు)పై మోదీ(5,81,022 ఓట్లు) ఘన విజయం సాధించారు. ఆనాడు మోదీపై పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కేజ్రీవాల్ వారణాసి బరిలో నిలిచారు. ఈ సారి ఇక్కడ మే19న ఎన్నిక జరగనుంది.
దిగ్గజాలపై దిగ్గజాలు పోటీ పడిన సందర్భాలు గతంలోను తాజాగానూ కొనసాగుతున్నాయి. 1984లో గ్వాలియర్ నుంచి వాజ్ పేయి పై పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో బళ్లారి నుంచి సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై పోటీ పడి ఓడిపోయారు. ప్రస్తుతం అమేథి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీ చేతిలో పరాజయం పాలయ్యారు.

No comments:

Post a Comment