Friday, October 18, 2019

CJI Gogoi recommends Justice S A Bobde as his successor


సీజేఐగా బోబ్డే పేరును సిఫార్సు చేసిన గొగొయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సీనియర్ జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే పేరును ప్రస్తుత సీజేఐ రంజన్ గొగొయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు బోబ్డే పేరును సిఫార్సు చేస్తూ ఆయన కేంద్రానికి శుక్రవారం లేఖ రాశారు. సంప్రదాయాన్ని అనుసరించి గొగొయ్ తన వారసుడిగా బోబ్డే ను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  కేంద్రం ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల బోబ్డే భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సుప్రీం జస్టిస్ గా 12 ఏప్రిల్ 2013 నుంచి వ్యవహరిస్తున్న బోబ్డే పదవీ కాలం 23 ఏప్రిల్ 2021 వరకు ఉంది. ఆయన గతంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ముంబయి, నాగ్ పూర్)లో చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం గొగొయ్ తర్వాత సుప్రీంకోర్టులో బోబ్డేనే అందరికంటే సీనియర్. గొగొయ్ 46వ సీజేఐగా 8 అక్టోబర్ 2018న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 17 నవంబర్ లో ముగియనుంది.