Friday, November 1, 2019

Rajnath Singh pays tribute to former PM Shastri


నిరుపమాన యోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి: రాజ్ నాథ్
పాకిస్థాన్ తో యుద్ధ సమయంలో భారత్ ను సమైక్యంగా పటిష్టంగా నిలిపిన యోధుడు దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్లాఘించారు. ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ లో పర్యటిస్తున్న రక్షణమంత్రి ఈ సందర్భంగా శుక్రవారం శాస్త్రి స్ట్రీట్ లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్-పాక్ ల యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ పిలుపు ఓ ప్రభంజనంలా యావత్ దేశాన్ని కదిలించిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు. యుద్ధానంతరం 1966 లో యూఎస్ఎస్ఆర్ మధ్యవర్తిత్వంలో భారత్-పాక్ ల మధ్య తాష్కెంట్ లో ఒప్పందం కుదిరింది. సరిగ్గా ఒక రోజు తర్వాత జనవరి 11న శాస్త్రీజీ ఆకస్మికంగా కన్నుమూశారు. శాస్త్రీజీ జీవనశైలి, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమని రాజ్ నాథ్ కొనియాడారు. శాస్త్రీజీ స్మృత్యర్థం నిర్మించిన పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు భారత్ పైన, హిందీ భాష పట్ల కనబర్చిన ప్రేమకు రక్షణ మంత్రి ముగ్ధులయ్యారు. ఈనెల 2,3 తేదీల్లో జరగనున్న ప్రభుత్వాధినేతల (సీహెచ్జీ) సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. అదేవిధంగా భారత్, ఉజ్బెకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల పైన చర్చలు జరుపుతారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) కీలక సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొననున్నారు.