Thursday, February 9, 2023

7 suffocate to death while cleaning oil tank at private factory in Andhra Pradesh's Kakinada

ఆయిల్ ట్యాంక్ లో దిగి.. ఏడుగురి మృత్యువాత

పొట్టకూటి కోసం ఆయిల్ ఫ్యాక్టరీలో పనికొచ్చి ఒకరి తర్వాత మరొకరిగా మొత్తం ఏడుగురు మృత్యుఒడికి చేరిన దుర్ఘటన ఇది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని జి.రాగంపేటలో ఈ ఘోరం గురువారం చోటు చేసుకుంది. ఇక్కడ అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం విధుల్లోకి వచ్చిన ఇద్దరు కార్మికుల్ని యాజమాన్యం ఆయిల్ ట్యాంక్ శుభ్రపర్చాల్సిందిగా పురమాయించింది. సుమారు 50 అడుగుల ట్యాంక్ లోకి తొలుత ఇద్దరు కార్మికులు  దిగారు. అందులో ఊపిరాడక వారు స్పృహ కోల్పోయారు. దాంతో వారిని రక్షించడానికి మరో ఇద్దరు అందులోకి దిగారు. ఈ నలుగురు నుంచి స్పందన లేకపోవడంతో మరో ముగ్గురు కార్మికులు ట్యాంక్ లో దిగి ఊపిరాడక లోపల పడిపోయారు. అలా ఒకరి తర్వాత ఒకరిగా ఏడుగురు కార్మికులు ప్రాణాలు ఒదిలారు. ఈ కార్మికులు ట్యాంక్ లు శుభ్రపరిచే పనివారు కాదని తెలుస్తోంది. వీరంతా ప్యాకింగ్ విధులు నిర్వర్తించే వారిగా గుర్తించారు. వీరికి ఆక్సిజన్ సిలిండర్లు, కనీసం మాస్క్ లు కూడా ఇవ్వకుండా ట్యాంక్ లోకి దింపినట్లు సహ కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో ఒకరి భార్య నిండు గర్భిణి కాగా మరో కార్మికుడు అతని తల్లిదండ్రులకు ఏకైక సంతానమని సమాచారం. చనిపోయిన ఏడుగురిలో అయిదుగురు పాడేరు కు చెందిన వారు కాగా మరో ఇద్దరు స్థానిక పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని భావిస్తున్నారు.