Tuesday, April 16, 2019

ec finally in action mode restricts four leaders from campaigning


ఈసీ కొరడా ఝళిపించింది

·  సుప్రీం తలంటుతో గుర్తుకు వచ్చిన అధికారాలు

ప్రజాస్వామ్య హితైషుల కోరిక నెరవేరింది. సుప్రీంకోర్టు తలంటడంతో ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) రాజకీయులపై పంజా విసిరింది. తమిళనాడు వేలూరు లోక్ సభ ఎన్నిక వాయిదా, ప్రచార పర్వంలో అదుపుతప్పిన నేతల నోటికి తాళం వేయడం, ఆంధ్రప్రదేశ్ లో అయిదు నియోజకవర్గాల్లో రీపోలింగ్ పై పరిశీలన వంటి కఠిన నిర్ణయాల్ని మంగళవారం (ఏప్రిల్16)ఈసీ తీసుకుంది. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పి.ఐ.ఎల్) పై సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్(సీజేఐ) నేతృత్వంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈసీపై పరుష వ్యాఖ్యల్ని చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘానికి ఆర్టికల్ 324 ప్రకారం సంక్రమించిన అధికారాలు గుర్తున్నాయా? లేక తామే గుర్తు చేయాలా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దాంతో గంట వ్యవధిలోనే ఈసీ తనకు గల విశేషాధికారాల కొరడాను ఝళిపించింది.
రామ్ పూర్(యూపీ) అభ్యర్థులుగా ఉన్న జయప్రద(బీజేపీ) పై అజాంఖాన్(ఎస్.పి సీనియర్ లీడర్) చేసిన చౌకబారు విమర్శల్ని ఈసీ సీరియస్ గా పరిగణించింది. ‘17 ఏళ్లుగా మీకు తెలిసిన జయప్రద నాకు 17 రోజుల్లోనే పూర్తిగా అర్థమయింది.. ఆమె ధరించే లోదుస్తులు ఖాకీ అని’ అంటూ అజాంఖాన్ నిసిగ్గుగా వ్యాఖ్యానించారు. దాంతో ఈసీ ఆయన నోటికి తాళం వేసింది. మూడు రోజులు ఆయన ప్రచారం చేయరాదని ఆంక్షలు విధించింది. మేనకాగాంధీ (కేంద్రమంత్రి, బీజేపీ), మాయవతి(బీఎస్పీ అధినేత్రి), యోగి ఆధిత్య నాథ్(ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ) ప్రచార పర్వంపైన ఈసీ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. షహరాన్ పూర్ ఎన్నికల ప్రచారంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికోసం తను పనిచేయనని వ్యాఖ్యానించారు. దాంతో మేనకాగాంధీ కూడా మూడు రోజులు ప్రచారం నిర్వహించ కుండా ఈసీ ఆంక్షలు విధించింది.
షహరాన్ పూర్, బరేలీ ఎన్నికల సభల్లో మాయవతి ప్రచారం నిర్వహిస్తూ ముస్లింలు బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డి. కూటమికే ఓటేయాలని కాంగ్రెస్ కు వేయొద్దని కోరారు. యోగి ఆధిత్యనాథ్ బడాన్ ర్యాలీలో మాట్లాడుతూ బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డి. కూటమితో అలీ ఉంటే బీజేపీకి బజరంగ్ భలీ అండ ఉందని పేర్కొన్నారు. దాంతో మాయవతి, యోగి ఆధిత్యనాథ్ లు రెండు రోజుల పాటు ప్రచారం చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ అయ్యాయి.  తమిళనాడులో వేలూరులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు బయట పడిన నేపథ్యంలో అక్కడ ఈనెల 18న జరగాల్సిన ఎన్నికని ఆక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న ముగిసిన ఎన్నికల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్ కు సీఈవో ద్వివేదీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్ నిర్వహించే అంశంపై పరిశీలన చేస్తోంది.  


engineering girl student commits suicide in lecturers apartment at visakhapatnam?


లెక్చరర్ అపార్ట్మెంట్ లో విద్యార్థిని బలవన్మరణం?
Image result for girl student hanging
విశాఖపట్టణంలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (ఏప్రిల్ 16)న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జోత్స్న అనే ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థినికి ఎంసెట్ కోచింగ్ సమయంలో లెక్చరర్ (బిహార్ కు చెందిన) అంకుర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించి సమీపంలోని కాలేజీలో చేరింది. అదే కాలేజీలో అంకుర్ కూడా లెక్చరర్ గా చేరాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అంకుర్ నివసించే ఫ్లాట్‌కు జ్యోత్స్న వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనికి లెక్చరర్ అంకుర్ నిరాకరించడంతో దిక్కుతోచని జ్యోత్స్న సోమవారం రాత్రి అతని ఫ్లాట్‌లోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా కేసు నమోదయింది. అంకురే పోలీసులకు తొలుత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆమె ఉరి వేసుకుందని చెబుతున్న సీలింగ్ ఫ్యాన్ చాలా ఎత్తులో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అంకురే తమ బిడ్డను హత్య చేశాడని ఆమె ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని జోత్స్న తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు.

Welcome to the World of Madame X Madonna to first track from new album


మడోనా కొత్త ఆల్బమ్ ‘వెల్ కం టు ది వరల్డ్ ఆఫ్ మేడమ్ ఎక్స్’
పాప్ సింగర్ మడోనా కొత్త ఆల్బమ్ ‘వెల్ కం టు ది వరల్డ్ ఆఫ్ మేడమ్ ఎక్స్’ తొలి పాట బుధవారం (ఏప్రిల్ 17) విడుదల కానుంది. ఈ ఆల్బమ్ టీజర్ ను సింగర్, డ్యాన్సరైన 60 ఏళ్ల మడోనా యూట్యూబ్ లో ఆదివారం విడుదల చేశారు. ఆమె ఈ ఆల్బమ్ లో టైటిల్ కేరక్టర్ పోషిస్తున్నారు. తనెవరో తెలియకండా జాగ్రత్తపడుతూ ప్రపంచమంతా మారు వేషాల్లో తిరిగే సీక్రెట్ ఏజెంట్.. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వైనంపై బాణీలు కూర్చారు. అణగారిన సమాజంలో వెలుగుపూలు విరజిమ్మే పాత్రను పరిచయం చేస్తూ వీనులవిందయిన బాణీలతో మేడమ్ ఎక్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మడోనాతో పాటు కొలంబియా సింగర్ మలుమ ఈ ఆల్బమ్ లో పాత్ర పోషిస్తున్నారు. తొలి పాటకు మెడెలిన్ గా పేరుపెట్టారు. మడోనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో మెడెలిన్ మ్యూజిక్ వరల్డ్ లో ఆసక్తిని రేపుతోంది. 2015లో ‘రెబల్ హార్ట్’ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ మడోనా నుంచి మేడమ్ ఎక్స్ ఆల్బమ్ రూపొందుతోంది.


Paris cathedral church caught under huge fire 850 years old landmark destroyed


పారిస్ లో పురాతన కేథడ్రాల్ చర్చి దగ్ధం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 850 ఏళ్ల నాటి అతి పురాతన కేథడ్రాల్ చర్చిలో సోమవారం(ఏప్రిల్15)రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. చర్చి ఆధునికీకరణ పనులు చేపట్టిన నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదవశాత్తునే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అగ్నికీలలకు చర్చి చాలా భాగం కాలిపోయింది. చర్చి పైకప్పు ఆనవాళ్లు లేకుండా బూడిదైపోయింది. హెలికాప్టర్ ద్వారా కూడా మంటల్ని అదుపు చేస్తున్నారు. వందలమంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వేలమంది జనం చర్చి దగ్ధమవుతున్న దృశ్యాలను తిలకిస్తూ ఆ ప్రాంతంలో గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మంటల్ని అదుపు చేసే క్రమంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే మంటలు పూర్తిగా అదుపులోకి రాగలవని భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇతరులెవరూ గాయపడలేదని వార్తా సంస్థల కథనం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ అగ్నిమాపక సిబ్బంది తెగువను, కృషిని ప్రశంసించారు. ఫ్రెంచి సంస్కృతికి చిహ్నమైన గోథిక్ చర్చిలో అగ్నిప్రమాదం జరిగిన ఈరోజు అత్యంత దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు.