Saturday, February 8, 2020

AP CM YS Jagan Inaugurates First Disha Police Station In Rajahmundry

రాజమండ్రిలో తొలి `దిశ` పోలీస్ స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి `దిశ పోలీస్ స్టేషన్` రాజమండ్రిలో ఏర్పాటయింది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ పీఎస్ ను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళల తోనే  రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశచట్టంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 13 ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలే ఉంటారని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శిమన్ శర్మ కూడా మహిళే కాబట్టి మరో అడుగు ముందుకేసి ఏకంగా 47 మంది మహిళా సిబ్బందిని ఈ పోలీస్ స్టేషన్ లో నియమించారని ప్రశంసించారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. త్వరితగతిన శిక్షలు పడితేనే వ్యవస్థలో భయం వచ్చి నేరాలు తగ్గుతాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణనూ పూర్తి చేసి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరి శిక్షలు విధిస్తామని చెప్పారు. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. తొలిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి అదే తప్పు చేస్తే నాల్గేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈసందర్భంగా `దిశ` యాప్‌ను సీఎం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి సుచరిత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ వంగాగీతా, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.