Friday, December 20, 2019

Unnao rape case life imprisonment for Ex- BJP MLA Kuldeep Singh Sengar

ఉన్నావ్ రేప్ కేసు దోషి ఎమ్మెల్యే సెంగర్ కు జీవితఖైదు
·   రూ.25 లక్షల జరిమానా
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ బాలిక అత్యాచార కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ నాయకుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు జీవితఖైదు శిక్ష ఖరారయింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ ప్రాణ రక్షణకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తగిన ఏర్పాట్లు చేయాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. ఉద్యోగం ఆశ చూపి ఎమ్మెల్యే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 2017లో బాధితురాలు మైనర్ గా ఉండగా ఈ దారుణం జరిగింది. దాంతో ఎమ్మెల్యే సహా అతని సోదరుడిపైన బాలిక అపహరణ, నిర్బంధం, లైంగిక దాడి, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ బాధిత బాలిక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంప్ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం కూడా బాలిక ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టి నిందితులు హత్యా యత్నం చేశారు. ఈ దుర్ఘటనలో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ బాధిత కుటుంబానికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. అదే విధంగా కేసు విచారణను యూపీ న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. ఎమ్మెల్యే సెంగర్ నేరానికి సంబంధించిన సమగ్ర సాక్ష్యాలను సీబీఐ న్యాయస్థానానికి అందించడంతో నేడు శిక్ష ఖరారయింది.