Sunday, June 9, 2019

Flashback! Rahul Gandhi meets nurse who held him in her hands as a baby 49 years ago



ప్రధాని మోదీకి అకస్మాత్తుగా కేరళపై ప్రేమ ఎందుకు కల్గింది?:రాహుల్
హఠాత్తుగా ప్రధాని మోదీకి కేరళపై ఎందుకు ప్రేమ పుట్టిందో అర్థం కావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చమత్కరించారు. తనకు ఘన విజయాన్ని కట్టబెట్టిన వాయ్ నాడ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మూడ్రోజుల పాటు కేరళ పర్యటనకు రాహుల్ విచ్చేసిన విషయం విదితమే. ఆదివారం(జూన్9) ఆయన పర్యటన ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లారు. అంతకు ముందు ఆయన కోజికోడ్ విమానాశ్రయంలో ఢిల్లీ తిరిగి వెళ్లే ముందు విలేకర్లతో ముచ్చటించారు. మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలపై చూపిన మమకారం బీజేపీయేతర ప్రభుత్వాలపై ఎప్పుడూ చూపలేదనడానికి అనేక ఉదాహరణలున్నాయన్నారు. ముఖ్యంగా కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుండగా ప్రధాని మోదీకి ఆకస్మికంగా ఈ రాష్ట్రంపై ప్రేమ కల్గడం అనుమానాలకు తావిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ కేరళ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు తొలి విదేశీ పర్యటన (మాల్దీవులు, శ్రీలంక)కు వెళ్తూ శనివారం హఠాత్తుగా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ కేరళ పర్యటనలో వాయ్ నాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఎంగపుజ్హ, ముక్కం పట్టణాల్లో రోడ్ షోల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మోదీ దేశాన్ని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ కేరళను ఉత్తరప్రదేశ్ తో సమానంగా ఆదరిస్తారని తాను భావించడం లేదని రాహుల్ అన్నారు.

49 ఏళ్లకు.. నర్సు రాజమ్మను కలుసుకున్న రాహుల్

ఢిల్లీ హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన తనను చేతుల్లోకి తీసుకున్న నర్సు రాజమ్మ వావిథిల్ ను ఆదివారం రాహుల్ గాంధీ కలుసుకున్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు తొలిసంతానంగా రాహుల్ 1970 జూన్ 19న జన్మించినప్పుడు రాజమ్మ ట్రైనీ నర్సుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. సోనియా ప్రసవం సమయంలో విధులు నిర్వర్తించిన రాజమ్మ..రాహుల్ ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నారు. రాహుల్ వాయ్ నాడ్ లో పోటీ చేస్తున్నారని తెలిసి సంబరపడిన రాజమ్మ ఆయనను కలుసుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసి కేరళలోనే ఉంటున్న రాజమ్మను తన పర్యటన సందర్భంగా రాహుల్ ప్రత్యేకంగా పిలిపించుకుని కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు.


brazen misuse of law editors guild of india condemns arrests of journalists and news channel head


యూపీ సీఎం పరువుకు నష్టం కల్గించారనే ఆరోపణలపై

ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్:ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై అభ్యంతరకర వార్తలను ప్రసారం చేశారంటూ జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. ఓ మహిళ యూపీ సీఎంను వివాహం చేసుకోవాలనుకుంటోందంటూ ప్రఖ్యాత జర్నలిస్ట్ కనొజియా ఓ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. దాంతో ఆయనను లక్నోలో శనివారం (జూన్8) యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను నోయిడాలోని ఓ జాతీయ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ ప్రసారానికి ఇషాంత్ సింగ్, అనుజ్ శుక్లా బాధ్యులుగా గుర్తించి వారిద్దర్ని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ చానల్ కు ప్రసారాల లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు జర్నలిస్టులు సీఎం ఆదిత్యనాథ్ పరువుకు భంగం కల్గించేలా వార్తలను ప్రసారం చేసినందుకు గాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ మహిళ లక్నోలోని సీఎం కార్యాలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ ఆదిత్యనాథ్ తో తనకు సంబంధముందని ఆయనను పెళ్లి చేసుకోవాలనుంటున్నట్లు పేర్కొంది. ఆ వీడియో తర్వాత ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జర్నలిస్టుల్ని నిర్హేతుకంగా ఏకపక్షంగా అరెస్టు చేశారని ఇది న్యాయవిరుద్ధమంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యను ఖండిస్తూ గిల్డ్ పత్రికా స్వేచ్ఛను హరించారని విలేకర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఓ మహిళ మనోభావనను నిష్పక్షపాతంగా ప్రసారం చేయడం, సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడం సీఎం పరువుకు భంగం కల్గించే నేరానికి పాల్పడినట్లుగా ఎలా భావిస్తారని ప్రశ్నించింది. కర్ణాటకలోనూ ఇటీవల ఇదే తరహాలో పోలీసులు వ్యవహరించారని తప్పుబట్టింది. ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్.ఐ.ఆర్) సైతం లేకుండా సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొంది. ఈ చర్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని దుర్వినియోగం చేయడంగా అభివర్ణించింది. పరువునష్టం కేసుల్ని నేరపూరిత కేసుల జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్ ను ఎడిటర్స్ గిల్డ్ పునరుద్ఘాటించింది. భారత శిక్షాస్మృతి(ఐ.పి.సి)లోని ఐ.టి.చట్టం సెక్షన్ 66 ప్రకారం నేరపూరిత కేసుగా పరువునష్టం కేసుని చొప్పించారంది. ఉద్దేశపూర్వకంగా, ప్రతీకారేచ్ఛతో జర్నలిస్టులపై నేరపూరిత పరువునష్టం కేసులు పెడుతున్నారని విమర్శించింది.