Wednesday, December 22, 2021

once again tension prevailed in Vizianagaram district Ramatheertham temple

వేడెక్కిన రామతీర్థం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మరోసారి వేడెక్కింది. ఏడాది క్రితం జిల్లాలోని రామతీర్థం ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ పురాతన రామాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తల నరికేసిన దుండగులు అశేషభక్తుల మనోభావాలను  దెబ్బతీశారు. దీనికి సంబంధించి నిందితులెవ్వర్ని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయిందని ఆలయ ధర్మాధికారి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తర్వాత తీరిగ్గా ప్రభుత్వం ఇక్కడ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని విమర్శించారు. ఇది `సర్కస్ కాదు.. పూజ` అని గుర్తు పెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయ జీర్ణోద్ధరణ కోసం తను విరాళం ఇవ్వగా మొహం మీదే తిప్పికొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భక్తులు ఆరాధనపూర్వకంగా చెల్లించే విరాళాల్ని ప్రభుత్వం తిరస్కరించడం మానుకోవాలని సూచించారు. ఇదిలావుండగా రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు మంత్రులు వెల్లంపల్లిశ్రీనివాస్, బొత్స సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు.