రైలు ఢీకొని బైకర్ దుర్మరణం
కోల్ కతాలో మోటారు బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రైలు
ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు ఆగ్నేయ రైల్వే
జోన్ అధికారులు తెలిపారు. కోల్ కతా నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఈస్ట్ కోస్ట్
ఎక్స్ ప్రెస్ చక్రాల కింద బైక్ నలిగిపోగా బైకర్ అక్కడికక్కడే చనిపోయినట్లు
సమాచారం. కోల్ కతా నుంచి రైలు బయలుదేరి 9 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సత్రాగచి
సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ ను ఆనుకుని నియంత్రణదారు లేని చోట
కాలిబాట మార్గంలో బైకర్ రైలు వస్తున్నా దాటేయొచ్చనే తలంపుతో బైక్ ను నడిపి ప్రాణాల
మీదకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11.45 సమయంలో రైలు దూసుకువస్తుండగా బైకర్
వాహనంతో సహా దాని చక్రాల కింద చిక్కుకుపోయి దుర్మరణం చెందినట్లు అధికారులు
వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియరావాల్సి ఉంది.