Tuesday, June 4, 2019

srilanka beat afganistan by 34 runs cricket world cup match number 7


అప్ఘానిస్థాన్ పై 34 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.7లో అప్ఘానిస్థాన్ ను ఓడించి శ్రీలంక టోర్నీలో తొలి గెలుపునందుకుంది. మంగళవారం కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన అప్ఘాన్ కెప్టెన్ గుల్బద్దీన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పడుతూ లేస్తూ 201 పరుగులకు(36.5 ఓవర్లకే) ఆలౌటయింది. వర్షం కారణంగా మధ్యలో మ్యాచ్ కు ఆటంకం కల్గడంతో డక్ వర్త్ లూయిస్ నిబంధనలు(డీఎల్ఎస్) ప్రకారం 41 ఓవర్లలో 187 పరుగుల విజయలక్ష్యంతో అప్ఘాన్ బ్యాటింగ్ కు దిగింది.జట్టులో నజీబుల్లా జర్దాన్ 56 బంతుల్లో 43 పరుగులు, హజ్రతుల్లా జజయ్ 25 బంతుల్లో 30 పరుగులు, గుల్బద్దీన్ నయీబ్ 32 బంతుల్లో 23 పరుగులు మాత్రమే రాణించారు. స్వల్ప స్కోరు ను ఛేదించడం సులభమేనన్న భ్రమలో అప్ఘాన్ బ్యాట్స్ మన్ తేలిగ్గా తీసుకోవడంతోనే ఆరంభంలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయారు. ఆ తర్వాత ఛేదనలో పుంజుకుంటున్న దశలో అప్ఘాన్ వికెట్లు కాపాడుకోలేక పోవడంతో ఓటమి పాలయింది. శ్రీలంక స్ట్రయిక్ బౌలర్లు నువాన్ ప్రదీప్ 4 వికెట్లు, లసిత్ మలింగా 3 వికెట్లు తిసర పెరెరా, ఇసుర ఉదాన చెరో వికెట్ తీసుకుని అప్ఘాన్ పతనాన్ని శాసించారు. 32.4 ఓవర్లకే ఆలౌటయిన అప్ఘానిస్థాన్ బ్యాట్స్ మన్ 152 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక టోర్నీ తొలిమ్యాచ్ లో మూడ్రోజుల క్రితం ఇదే వేదికపై న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడినా 34 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజ వేసింది. శ్రీలంక బ్యాట్స్ మన్లలో కుశాల్ పెరెరా 81 బంతుల్లో 78 పరుగులతో రాణించాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 45 బంతుల్లో 30 పరుగులు, లహిరుతిరుమాన్నె 34 బంతుల్లో 25 పరుగుల చేయడంతో శ్రీలంక చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగల్గింది. అప్ఘాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 4/30 రషీద్ ఖాన్2/17 దవ్లాత్ జర్దాన్ 2/34 రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ (4/31) నిలిచాడు.

Tiger attacks linesman in Madhya Pradesh



పులి దాడిలో లైన్ మన్ కు తీవ్రగాయాలు
మధ్యప్రదేశ్ లోని సియొని జిల్లాలో పెద్దపులి దాడిలో రాష్ట్ర విద్యుత్ శాఖ సిబ్బంది ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. మంగళవారం (జూన్4) జరిగిన ఈ ఘటనలో 58ఏళ్ల యశ్వంత్ బైసెన్ అనే లైన్ మన్ తీవ్రంగా గాయపడినట్లు అటవీ శాఖాధికారి రాకేశ్ కొడొపె తెలిపారు. పరస్పాని గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సాయంత్రం 5 సమయంలో విద్యుత్ సిబ్బంది లైన్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈదురుగాలులకు ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో వాటిని సరిచేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రానికి ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉండగా పొదల చాటున మాటువేసిన పులి ఒక్కసారిగా బైసెన్ పైకి దూకింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడినా అతను అలారం మోగించడంతో మిగిలిన సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కేకలు వేస్తూ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పులి అడవిలోకి పారిపోయింది. ఈ వారంలో ఈ ప్రాంతంలో పులి దాడి ఘటనల్లో ఇది రెండోది. 22 ఏళ్ల పంచాం గజ్బా కూడా ఇదే ప్రాంతంలో పులి దాడిలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలో గాయపడిన బైసెన్ ను సమీపంలోని కురై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Silence, security in Beijing on 30th Tiananmen anniversary



తియాన్మన్ స్క్వేర్ లో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం
సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.. 4 జూన్ 1989.. ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన విద్యార్థి లోకం కమ్యూనిస్టు చైనా పాలకుల కర్కశ దాష్టీకానికి బలై ఉద్యమం పాతాళానికి తొక్కబడిన రోజు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు నాటి సైనికులు చేపట్టిన మారణకాండలో అసువులు బాశారు. మంగళవారం(జూన్ 4) తియాన్మన్ స్క్వేర్ లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చైనా భద్రతా, నిఘా విభాగాలు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా, సైనిక ట్యాంకర్లు తిరుగాడుతున్నాయి. విదేశీ పర్యాటకుల్ని సునిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఇతర దేశాల మీడియాకు తియాన్మన్ స్క్వేర్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతి నిరాకరిస్తున్నారు. అవాస్తవాల్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రస్తుతం అక్కడ ఫొటోలు తీయడానికీ అనుమతించడం లేదు. వీసా పొడిగింపుల్ని కఠినతరం చేశారు. అమెరికా ఈ రోజును `వీరోచిత పోరాట దినం`గా పేర్కొన్న నేపథ్యంలో చైనా తియాన్మన్ స్క్వేర్ లో మరింత కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. ట్విటర్ తరహాలోని `వైబో` సామాజిక మాధ్యమంలో తియాన్మన్ అనే అక్షరాల్ని టైప్ చేస్తే కమ్యూనిస్టు చైనా 70వ వార్షికోత్సవ లోగో దర్శనమిస్తోంది. చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ 2012లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పౌర సమాజం కదలికల పైనా ఆంక్షల తీవ్రత మరింత పెరిగిపోయింది.  కనీసం నాటి విద్యార్థి ఉద్యమం ఊసు కూడా ప్రస్తావనకు రాకుండా చర్యలు చేపట్టారు. కార్మిక హక్కుల కోసం పోరాడే నాయకులు, ఉద్యమకారులు, పౌరహక్కుల కోసం పాటుపడే న్యాయవాదులు, చివరికి మార్క్సిస్ట్ విద్యార్థుల్ని సైతం ఆంక్షల చట్రం వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు చైనా అలాగేమీ లేదని చాలా మారిపోయిందని డబ్బే ఇక్కడ ప్రధానమైపోయిందని అది ఉంటే ఏదైనా సాధ్యమని డిడి క్యాబ్ సర్వీస్ డ్రైవర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆనాడు ఏం జరిగిందో తమకందరికీ తెలుసని..అయితే ఆ అణచివేతను తామేమి లక్ష్యపెట్టమని పేర్కొన్నాడు.