Thursday, August 26, 2021

`Immediate Task Is Evacuation`: Centre At All-Party Meet On Afghanistan

మనవాళ్లని వెనక్కితేవడమే తక్షణ లక్ష్యం: జైశంకర్

అఫ్గనిస్థాన్ లో చిక్కుకున్న మనవాళ్లనందర్నీ త్వరగా వెనక్కి తీసుకురావడమే తక్షణ లక్ష్యమని కేంద్రప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ల ఆకస్మిక పాలన అమలులోకి వచ్చిన నేపథ్యంలో అఫ్గనిస్థాన్ లో తాజా సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన ప్రజలతో పాటు సుమారు 15వేల మంది భారతీయులు అక్కడ నుంచి స్వదేశానికి చేరుకోవాలని ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 31 పార్టీలకు చెందిన ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లతో పాటు రాజ్యసభ, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులు పాల్గొన్నారు. అఫ్గన్ సంక్షోభం గురించి మోదీ తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో ఫోన్ లో మాట్లాడినట్లు జైశంకర్ తెలిపారు. మనవాళ్లని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఇందుకుగాను ఈ-వీసా పాలసీని అమలులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో భారతీయులందర్నీ స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.