Sunday, September 29, 2019

Government bans onions export


ఉల్లి ఎగుమతులపై భారత సర్కారు నిషేధాస్త్రం
దేశంలో ఉల్లి కొరత నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం ఎగుమతుల్ని నిషేధించింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వచ్చాయి. ఆదివారం ఈ మేరకు ఉల్లి ఎగుమతుల విధానాన్ని సవరిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఉల్లి ఎగుమతులపై ఎటువంటి పరిమితులు లేవు. ఆ నిబంధనను రద్దు చేస్తూ కేంద్రం సవరించిన ఉల్లి ఎగుమతుల నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఏడాదిలో భారత్ నుంచి రూ.3,497 కోట్ల ఉల్లి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్ లో చుక్కలనంటుతున్న ఉల్లి ధరల్ని దారిలోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ 15 రోజుల క్రితం కనీస ఎగుమతి ధరను టన్నుకు రూ. 59,932గా నిర్ణయించింది. అయినా దేశీయ అవసరాలకు ఉల్లి అందుబాటులో లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ మేరకు సాంతం ఉల్లి ఎగుమతులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దేశంలో గరిష్ఠంగా ఉల్లిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వరదలతో అల్లాడుతుండడంతో దిగుబడి తగ్గిపోయి గిరాకీ గణనీయంగా పెరిగింది. దాంతో ఎంతకూ ధరలు దిగిరావడం లేదు. భారత్ నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈలకు ఉల్లి ఎగుమతయ్యేది.