Thursday, February 17, 2022

Hyderabad police arrest Telangana Congress chief A Revanth Reddy over remarks against CM

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం తెల్లవారుజామున అరెస్ట్ అయ్యారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవ సంబరాల్లో ఆ పార్టీ శ్రేణులు మునిగితేలుతుండగా రేవంత్ అరెస్ట్ పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ..రాహుల్‌గాంధీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. అస్సాం సీఎంపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ మేరకు బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అస్సాం సీఎంపై కేసు నమోదు చేయకుండా కేసీఆర్‌ తాత్సారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నేడు నిరసన కార్యక్రమాలు జోరు పెంచాలని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దాంతో ఈ రోజు ఉదయం రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందన్నారు.