టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’
బైడన్..కమలా
అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లను టైమ్స్ పత్రిక `పర్సన్ ఆఫ్ ది ఇయర్`గా ఎంపిక చేసింది. నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ ఓడించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ `పర్సన్ ఆఫ్ ది ఇయర్` తాజా జాబితాలో బైడెన్, కమలాలకు అగ్రస్థానం దక్కింది. ఈ ఇద్దరు డెమొక్రాటిక్ నేతలు ముగ్గురు ఫైనలిస్టులను దాటుకుని ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఆంథోనీ ఫౌచీ, డొనాల్డ్ ట్రంప్ తదితరులు పోటీపడ్డారు. 78 ఏళ్ల బైడెన్, 56 ఏళ్ల కమలా ఫోటోలను కవర్ పేజీపై ముద్రించిన టైమ్ మ్యాగజైన్ `అమెరికా కథను మార్చారు` అంటూ కింద ఉప-శీర్షికను పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అలాగే అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎవరికి సాధ్యం కానిరీతిలో బైడెన్ 70 మిలియన్లకు పైగా ఓట్లను సాధించారు. ఇంత వరకు 2006 ఎన్నికల్లో బారాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా దానిని బైడన్ అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం విదితమే.