Thursday, April 30, 2020

Rishi Kapoor passes away at 67 Big B confirms the news on twitter

రిషికపూర్ మృతికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం
నటుడు, నిర్మాత, దర్శకుడిగా రాణించి హిందీ చలనచిత్ర పరిశ్రమను ఏలిన రిషికపూర్(67) మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ దిగ్గజం రణబీర్ రాజ్ కపూర్ ద్వితీయ పుత్రుడైన రిషి 2018 నుంచి కేన్సర్ తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. గతంలో ఆయన న్యూయార్క్లో చికిత్స తీసుకొని భారత్ వచ్చారు. ఇటీవల వ్యాధి మళ్లీ ముదరడంతో ముంబయిలోని ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందారు. 'మేరా నామ్ జోకర్' సినిమా ద్వారా బాలనటుడిగా రిషి తెరంగేట్రం చేశారు. 1974 లో ఆయన  'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మెప్పించారు. దాంతోపాటు `ది బాడీ` అనే మూవీలోనూ, వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటించారు. తండ్రి పేరునే కొడుకుకు (రణబీర్ కపూర్) రిషికపూర్ పెట్టుకున్నారు. లెజెండ్ తరలిపోయారని టాలీవుడ్ ప్రముఖ వెటరన్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కోలివుడ్ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు రిషికపూర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. రిషి మరణవార్తను బిగ్ బీ అమితాబ్ ట్విటర్ వేదికగా తొలుత ధ్రువీకరించారు. ఆలిండియా సూపర్ స్టార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ తో మరణించిన రోజు వ్యవధిలోనే మరో అగ్రనటుడు రిషి అదే వ్యాధి తోనే కన్నుమూయడంతో బాలీవుడ్ తీవ్ర శోకంలో మునిగిపోయింది.

Sunday, April 26, 2020

Serum Institute to start production of Oxford Universitys COVID-19 vaccine in 3 weeks

అతి త్వరలో భారత్ లో కరోనా వ్యాక్సిన్!
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి పీచమణిచే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఈ వైర‌స్‌ను నివారించే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భార‌త్‌లో మూడు వారాల త‌ర్వాత  ప్రారంభిస్తామ‌ని ప్ర‌ముఖ సంస్థ సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ తో కలిసి సీరం సంస్థ కరోనా నివారణ వ్యాక్సిన్ త‌యారీ కీలకదశకు చేరుకుంది. ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం మనుషులపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కొనసాగుతోన్న విషయం విదితమే. సుమారు 50 మంది (18 నుంచి 55 ఏళ్లు) వాలంటీర్ల కు వ్యాక్సినేషన్ చేసినట్లు తెలుస్తోంది. కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్ ల్ని ఈ వ్యాక్సిన్ అడ్డుకోగలదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ దిశగా వందల సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలు ముందుగా సాగుతుండగానే ఆక్స్ ఫర్డ్ బృందం ట్రయల్స్ కొలిక్కి వచ్చాయి. ఈ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతమైతే మూడు వారాల త‌ర్వాత‌ పుణె ప్లాంట్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేప‌డ‌తామ‌ని సీరం ప్రకటించింది. తాము ఉత్ప‌త్తి చేయ‌బోయే వ్యాక్సిన్‌కు పేటెంట్ కోర‌దలచుకోలేదని సంస్థ సీఈవో పూనావాలా తెలిపారు. వీలైనంత ఎక్కువ ఉత్ప‌త్తి జ‌రిగితేనే ప్రపంచమంతటా వ్యాక్సిన్ అంద‌రికీ అందుబాటులోకి రాగలద‌ని తద్వారా మహమ్మారిని నిలువరించడం సాధ్యమౌతుందని వెల్ల‌డించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం కొత్త ప్లాంట్ నెల‌కొల్పాంటే రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.. కాబట్టి  పుణె ప్లాంట్‌లోనే వ్యాక్సిన్‌ ఉత్ప‌త్తి చేపడతామ‌న్నారు. సెప్టెంబర్ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయి ప్రభుత్వ అనుమతులు పొందాక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.

Tuesday, April 21, 2020

Hyderabad Haleem makers association decided against cooking and sale of the dish due to lockdown

హలీం.. తయారీ లేదు!
గల్లీ గల్లీలోనూ చవులూరించే హలీం ఈసారి భాగ్యనగరంలో కనిపించదు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజంతా ఉపవాసం ఉన్నాక తక్షణ శక్తి కోసం పోషకాహారమైన హలీం తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు హలీం రుచి అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో అన్నింటితో పాటు ప్రార్థనలకు గండిపడింది. దాంతో రంజాన్ సామూహిక ప్రార్థనలతో పాటు హలీం ఆరగింపునకు తెరపడనుంది. రంజాన్ నెలంతా దొరికే హలీంను ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు లొట్టలేసుకుంటూ తింటారు.  ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసుకొని మరీ చికెన్, మటన్, వెజ్ వెరైటీ హలీంలను టేస్ట్ చేసి తరిస్తుంటారు. వాటన్నింటికి ఇప్పుడు `లాక్ డౌన్` పడ్డట్లే. ఈ ఏడాది ఎక్కడా హలీం తయారీ ఉండబోదని హలీం మేకర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. ప్రార్థనలు, పండుగలు అన్నీ ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మసీదుల్లో కూడా సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. కేవలం ఇమామ్, మౌజన్లు మాత్రమే మసీదుల్లో నమాజులు చేసుకొనే వెసులుబాటు పొందారు.

Saturday, April 18, 2020

YSRCP Hon`ble president Vijayamma requests AP minister Vellampalli Srinivas to help Vijayawada priests

విజయమ్మ చొరవతో పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
వై.ఎస్.ఆర్.సి.పి. గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చొరవ తీసుకోవడంతో విజయవాడ కర్మాన్ ఘాట్ లో పురోహితులకు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల పిండ ప్రదానాలు నిర్వహించే కర్మాన్ ఘాట్ పురోహితుల ఆకలిదప్పులపై ప్రభుత్వం స్పందించింది. శనివారం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కొక్కరికి రూ.వేల విలువ చేసే నిత్యావసరాల కిట్లను అందజేశారు. టీవీ9లో ప్రసారమైన వార్తా కథనానికి స్పందించిన విజయమ్మ మంత్రి శ్రీనివాస్ కి ఫోన్ చేసి వారికి సత్వర సాయం అందించాలని కోరారు. దాంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం నెలరోజులకు సరిపడా బియ్యం, కంది, మినపగుళ్లు తదితర నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20 కిలోల చొప్పున నాణ్యమైన బియ్యంతో పాటు అవసరమైన ఆహార దినుసుల్ని వారికి అందించామన్నారు. ఇప్పటికే తమ పశ్చిమ నియోజకవర్గంలో లక్షా4వేల మందికి బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు వివరించారు. ఈరోజు కర్మాన్ ఘాట్ సమీపంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పురోహితులు సామాజిక దూరాన్ని పాటిస్తూ కిట్లను అందుకున్నారన్నారు.

Thursday, April 16, 2020

High alert continues towards AP CM`s camp office surrounding areas in Tadepalli

సీఎం జగన్ ఇంటి పరిసరాల్లో హైఅలర్ట్
గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. తాడేపల్లిలో సైతం కరోనా బాధిత కేసులు నమోదుకావడంతో అధికారులు, సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా నిరంతర పహారా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతం ఇక్కడకు 7కి.మీ దూరంలోనే ఉండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాల్ని గంటగంటకు విస్తృతంగా చేపడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా గుంటూరు, కర్నూలు జిల్లాలు కరోనా కేసుల్లో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 118 కేసులతో మూడంకెలకు చేరుకోగా కర్నూలు 98 కేసులతో ఆ దిశగా పయనిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 550కి చేరువలో ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 14కు చేరుకుంది. దాంతో రెడ్ జోన్లతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో మొత్తం 11 జిల్లాల్ని రెడ్ జోన్లగా ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే నేటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దాంతో ఈ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయినా ఈ జిల్లాలో లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగానే అమలు చేస్తున్నారు.

Wednesday, April 15, 2020

Karnataka former CM Kumaraswamy to go ahead with his son marriage during covid-19 pandemic

కుమార.. నీకు అర్థమౌతోందా?!
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో విలవిల్లాడిపోతుంటే.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అర్థమౌతోందా? అనే అనుమానం కల్గుతోంది. దేశంలో తాజాగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండగా అనుకున్న ముహూర్తానికే కొడుకు పెళ్లి చేసేయాలని కుమారస్వామి ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. తన కుమారుడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన నిఖిల్ గౌడ, కాంగ్రెస్ నేత ఎం. క్రిష్ణప్ప మనవరాలు (మేనకోడలి కూతురు) రేవతి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాలని తొలుత అనుకున్నారు. రామనగర జిల్లాలో 95 ఎకరాల స్థలంలో వివాహ వేదిక ప్రాంగణాన్ని నిర్మించి అయిదు లక్షల మంది పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులను ఆహ్వానించాలని ఆయన భావించారు. తర్వాత బెంగళూరులో గ్రాండ్ రిసెప్షనూ ఏర్పాటు చేయాలనుకున్నారు. నిశ్చితార్థానికి సీఎం యడ్యూరప్ప సహా పలువురు ప్రముఖులు కుమారస్వామి ఆహ్వానం మేరకు హాజరయ్యారు. కానీ లాక్‌డౌన్-2 అమలులో ఉన్న కారణంగా పెళ్లికి లక్షల మందిని ఆహ్వానించే పరిస్థితి లేదు. అయినా నిఖిల్, రేవతిల పెళ్లి యథాతథంగా ఏప్రిల్ 17న  జరగనుంది. ఆ రోజున మంచి ముహూర్తం ఉండడమే అందుకు కారణం. పైగా ముహూర్తాల పట్ల, దేవుడి మీద అపార నమ్మకం కల్గిన ఆయన ముందు నిర్ణయమైన తేదీలోనే ఎలాగైనా సరే పెళ్లి జరపాలని నిర్ణయించారు.  అయితే తన కొడుకు పెళ్లికి ఎవరూ రావొద్దని జేడీఎస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులను కుమారస్వామి కోరుతున్నారు. కరోనా తగ్గిసాధారణ పరిస్థితులు నెలకొన్నాకే  బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పెళ్లికి 15 నుంచి 20 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని కుమారస్వామి ప్రకటించారు.

Tuesday, April 14, 2020

AP DGP office will provide special passes to them who needs emergency services

ఏపీలో లాక్ డౌన్ స్పెషల్ పాస్ లు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసుశాఖ స్పెషల్ పాస్ లు జారీ చేయనుంది. మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. మంగళవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మే 3వరకు మరో 19 రోజులు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలువుతోంది. రోడ్లపై పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అదే విధానం ఏపీలోనూ గడిచిన 21 రోజులుగా కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మండలాన్ని యూనిట్ గా తీసుకుంటూ  రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ మండలాలున్న సంగతిని ఇటీవల ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు. రాబోయే కాలంలో దశలవారీగా లాక్ డౌన్ నిబంధనల సడలింపును కోరారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ప్రధాని లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పాసులు మంజూరు చేస్తామని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. పాస్ మంజూరు కోసం 13 జిల్లాల పోలీస్ శాఖ వాట్సాప్ నెంబర్లు, మెయిల్ వివరాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితిలో పాస్ కావాల్సిన వారు ఆధార్ కార్డు, పూర్తి వివరాలతో పాటు తమ సమస్యలను ఆయా జిల్లా పోలీస్ అధికారులకు వివరిస్తే వెంటనే పాస్ మంజూరు చేస్తారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. పాస్లను దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జిల్లాల వారీగా ఎస్పీ ఆఫీస్ ఫోన్ నంబర్లు
శ్రీకాకుళం-6309990933
విజయనగరం-9989207326
విశాఖపట్టణం(సిటీ)-9493336633
విశాఖపట్టణం(రూరల్)-9440904229
తూర్పుగోదావరి-9494933233
పశ్చిమగోదావరి-8332959175
కృష్ణా-9182990135
విజయవాడ(సిటీ)-7328909090
గుంటూరు(అర్బన్)-8688831568
గుంటూరు(రూరల్)-9440796184
ప్రకాశం-9121102109
నెల్లూరు-9440796383
చిత్తూరు-9440900005
తిరుపతి(అర్బన్)-9491074537
అనంతపురం-9989819191
కడప-9121100531
కర్నూలు-7777877722

Monday, April 13, 2020

CM KCR wears mask first time after state record first Covid case

తొలిసారి ముసుగులో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి మాస్క్ ధరించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితరాలపై ఆయన సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 1 హైదరాబాద్కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్కు కరోనా పాజిటివ్ వచ్చిన  నెలన్నర తర్వాత తొట్టతొలిసారి సీఎం కేసీఆర్ మాస్క్ ధరించారు. రాష్ట్రంలో ఇప్పటికే మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందేసర్జికల్ మాస్క్ధరించి వచ్చిన ముఖ్యమంత్రితో పాటు సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులైనా, పోలీస్ అధికారులైనా చేతులు సబ్బుతో కడుక్కున్న అనంతరం శానిటైజర్తో రబ్ చేసుకున్న తర్వాతే లోపలికి రావాలనే నిబంధన ప్రగతి భవన్ లో అమలు చేస్తున్నారు. ఇక సమీక్షా సమావేశం, కేబినెట్ భేటీ ఏదైనా సామాజిక దూరం పాటిస్తున్నారు. అనంతరం జరిగే ప్రెస్మీట్స్ లోనూ జర్నలిస్టులందరూ సామాజిక దూరం పాటించేలా కుర్చీలు దూరంగా వేస్తుండడం తెలిసిందే. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చే వారెవరైనా ముక్కు, నోటిని కప్పిఉంచేలా మాస్క్ ధరించాలని సర్కారు స్పష్టం చేసింది. మార్కెట్లో కొరత ఉంటే ఇంట్లోనే మాస్క్ తయారుచేసుకోవాలని, కనీసం కర్చీఫ్ (చేతి రుమాలు)నైనా వాడాలని సూచించింది.