Friday, May 31, 2019

Neither now nor in future nithish sayson possibility of jd(u)joining modi government



భవిష్యత్ లో కూడా మోదీ ప్రభుత్వంలో చేరబోం:సీఎం నితిష్
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఎన్డీయే సర్కార్ కు షాక్ ఇచ్చారు. శుక్రవారం(మే31) ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా చేరబోమని తేల్చి చెప్పేశారు. అయితే ఎన్డీయే మిత్రపక్షంగా తాము కొనసాగుతూనే ఉంటామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వేళ తాము తొలుత తీసుకున్న నిర్ణయమే మున్ముందు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనతాదళ్ (యునైటెడ్) కీలక సంఘం(కోర్ కమిటీ) తీవ్రంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్డీయే పక్షాల ఐక్యతకు చిహ్నంగా కేంద్ర మంత్రివర్గంలో చేరాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తాజా కేంద్ర మంత్రివర్గంలో తొలుత జె.డి(యు) చేరాలనుకున్నా తర్వాత పార్టీలో కీలక చర్చల అనంతరం చేరరాదనే తుది నిర్ణయం తీసుకున్నట్లు నితిష్ తెలిపారు. కేవలం ఐక్యతా చిహ్నంగా ఉండేందుకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలనుకోవడం లేదన్నారు. బిహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నమాట(బీజేపీతో కలిసి) వాస్తవమేనంటూ ఆయన తమ ప్రభుత్వంలో కచ్చితమైన దామాషాలో భాగస్వామ్య పక్షాలకు పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాజ్ పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ మిత్రపక్షాలకు సముచిత స్థానం లభించిందని చెప్పారు.