అతి
త్వరలో భారత్ లో కరోనా వ్యాక్సిన్!
ప్రపంచాన్ని
గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి పీచమణిచే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఈ
వైరస్‌ను నివారించే వ్యాక్సిన్ ఉత్పత్తిని భారత్‌లో మూడు వారాల తర్వాత ప్రారంభిస్తామని ప్రముఖ సంస్థ సీరం ఇన్సిట్యూట్
ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన ఆక్స్‌ఫర్డ్
యూనివర్సిటీ తో కలిసి సీరం సంస్థ కరోనా నివారణ వ్యాక్సిన్ తయారీ కీలకదశకు చేరుకుంది.
ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతోన్న
విషయం విదితమే. సుమారు 50 మంది (18 నుంచి 55 ఏళ్లు) వాలంటీర్ల కు వ్యాక్సినేషన్ చేసినట్లు
తెలుస్తోంది. కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్ ల్ని ఈ వ్యాక్సిన్ అడ్డుకోగలదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ దిశగా వందల సంస్థలకు
చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలు ముందుగా సాగుతుండగానే ఆక్స్ ఫర్డ్ బృందం ట్రయల్స్
కొలిక్కి వచ్చాయి. ఈ ట్రయల్స్ విజయవంతమైతే మూడు వారాల తర్వాత పుణె ప్లాంట్‌లో
వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతామని సీరం ప్రకటించింది. తాము ఉత్పత్తి చేయబోయే వ్యాక్సిన్‌కు
పేటెంట్ కోరదలచుకోలేదని సంస్థ సీఈవో పూనావాలా తెలిపారు. వీలైనంత ఎక్కువ ఉత్పత్తి
జరిగితేనే ప్రపంచమంతటా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రాగలదని తద్వారా మహమ్మారిని
నిలువరించడం సాధ్యమౌతుందని వెల్లడించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం కొత్త ప్లాంట్
నెలకొల్పాంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది.. కాబట్టి పుణె ప్లాంట్‌లోనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతామన్నారు.
సెప్టెంబర్ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అన్ని
క్లినికల్ ట్రయల్స్ పూర్తయి ప్రభుత్వ అనుమతులు పొందాక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే
అవకాశముంది.